Shahbaz Ahmed: నా కల నెరవేరింది: టీమిండియాలోకి ఎంపికపై షాబాజ్ అహ్మద్
16 August 2022, 21:51 IST
- Shahbaz Ahmed: ఐపీఎల్‌లో ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అదరగొట్టిన ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ అనుకోకుండా టీమ్‌లోకి ఎంపికయ్యాడు. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో అతన్ని ఎంపిక చేశారు.
షాబాజ్ అహ్మద్
న్యూఢిల్లీ: ఇండియన్ క్రికెట్ టీమ్‌లోకి ఎంపిక కావడంతో తన కల నిజమైందని అన్నాడు బెంగాల్, ఆర్సీబీ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్. గురువారం (ఆగస్ట్ 18) నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం 16 మంది సభ్యుల టీమిండియాలోకి అతన్ని ఎంపిక చేశారు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో అతనికి రీప్లేస్‌మెంట్‌గా షాబాజ్‌ను సెలక్ట్ చేసినట్లు బీసీసీఐ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇండియన్ టీమ్ నుంచి పిలుపు రావడం అతనికిదే తొలిసారి. కౌంటీ క్రికెట్‌లో లాంకషైర్ తరఫున రాయల్ లండన్ కప్ ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ భుజం గాయం కావడంతో జింబాబ్వే టూర్‌కు దూరమయ్యాడు. బెంగాల్ తరఫున నిలకడగా ఆడుతున్న షాబాజ్‌కు అనుకోకుండా టీమిండియా అవకాశం వచ్చింది. అతడు రంజీ ట్రోఫీలో బెంగాల్ టీమ్ తరఫున 20 వికెట్లు తీయడంతోపాటు ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో 482 రన్స్ చేశాడు.
ఇక ఐపీఎల్ 2022లో ఆర్సీబీ తరఫున 16 మ్యాచ్‌లలో 219 రన్స్ చేయడంతోపాటు 4 వికెట్లు తీసుకున్నాడు. సివిల్ ఇంజినీర్ అయిన షాబాజ్.. 2018లో ఫస్ట్‌క్లాస్, లిస్ట్ ఎ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తన జర్నీకి సపోర్ట్ చేసిన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, కోచ్‌లకు షాబాజ్ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాడు. "క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరూ ఇండియన్ కలర్స్‌లో ఆడాలని కలలు కంటారు. ఇప్పుడు నా కల కూడా నిజమైంది. బెంగాల్ టీమ్‌కు ఆడిన ప్రతిసారీ నా పూర్తి సామర్థ్యం మేరకు ఆడాను. బెంగాల్ టీమ్ నాపై నమ్మకం ఉంచింది. ఛాన్స్ వస్తే నా బ్యాటింగ్, బౌలింగ్‌లతో టీమిండియాకు విజయాలు సాధించిపెట్టాలని అనుకుంటున్నాను" అని షాబాజ్ అన్నాడు.
అయితే షాబాజ్‌కు తుది జట్టులో చోటు దక్కడం అంత సులువు కాదు. ఇప్పటికే టీమ్‌లో అక్షర్ పటేల్, దీపక హుడా, కుల్దీప్ యాదవ్‌లాంటి వాళ్లు ఉన్నారు. అయితే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నా కూడా తన కాన్ఫిడెన్స్ పెరుగుతుందని అతను అన్నాడు. ఇండియా, జింబాబ్వే మధ్య ఈ నెల 18, 20, 22 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి.