MI vs RCB: విజృంభించిన కోహ్లి - రాయల్ ఛాలెంజర్స్ చేతిలో ముంబై చిత్తు
03 April 2023, 6:35 IST
MI vs RCB: విరాట్ కోహ్లి, డుప్లెసిస్ బ్యాటింగ్ మెరుపులతో ఆదివారం ముంబై ఇండియన్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిత్తుగా ఓడించింది.
విరాట్ కోహ్లి, మ్యాక్స్‌వెల్
MI vs RCB: ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లోనే కోహ్లి (Virat Kohli) జూలు విదిల్చాడు. బ్యాటింగ్‌లో చెలరేగిపోయాడు. కోహ్లితో పాటు డుప్లెసిస్ బ్యాటింగ్ మెరుపులతో ఆదివారం ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బెంగళూరుకు కోహ్లి, డుప్లెసిస్ మెరుపు ఆరంభాన్ని అందించారు.
ఇద్దరు పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదడంతో బెంగళూరు ఈజీగా విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 49 బాల్స్‌లో ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 82 రన్స్ చేయగా డుప్లెసిస్ 43 బాల్స్‌లో ఆరు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 73 రన్స్ చేశాడు. వీరిద్దరి జోరుతో బెంగళూరు నాలుగు ఓవర్లు మిగిలుండగానే గెలిచింది. విజయానికి చేరువలో డుప్లెసిస్ ఔట్ కావడం, అతడి తర్వాత బ్యాటింగ్ దిగిన కార్తిక్ డకౌట్‌గా వెనుదిరగడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది.
కానీ మ్యాక్స్‌వెల్ తనదైన శైలిలో సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. కేవలం మూడు బాల్స్‌లోను రెండు సిక్సర్లతో 12 పరుగులు చేసిన బెంగళూరుకు విక్టరీని అందించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తిలక్‌వర్మ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫలం కావడంతో ఇరవై ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది.
46 బాల్స్‌లో నాలుగు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 84 పరుగులు చేశాడు తిలక్‌వర్మ. అతడి ఒంటరిపోరాటంతో ముంబై ఈ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. బెంగళూరు బౌలర్లు సిరాజ్, కర్ణ్ శర్మతో పాటు మిగిలిన వారు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ముంబైని కట్టడిచేశారు.