RCB vs LSG: లాస్ట్ బాల్ థ్రిల్లర్ - 15 బాల్స్‌లోనే పూరన్ హాఫ్ సెంచరీ - 213 పరుగుల్ని ఛేజ్ చేసిన లక్నో
11 April 2023, 6:33 IST
RCB vs LSG: నికోలస్ పూరన్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో బెంగళూరుపై లక్నో సూపర్ జెయింట్స్ 1 వికెట్ తేడాతో విజయాన్ని సాధించింది. బెంగళూరు విధించిన 213 పరుగుల టార్గెట్‌ను చివరి బాల్‌కు లక్నో ఛేదించింది.
నికోలస్ పూరన్
RCB vs LSG: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగింది. ఆఖరి బాల్‌కు బైస్ ద్వారా లభించిన సింగిల్ రన్‌తో బెంగళూరుపై లక్నో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 212 పరుగులు చేయగా నికోలస్ పూరన్ ఫాస్టెస్ట్ హాఫ్‌సెంచరీతో పాటు మార్కస్ స్టోయినస్ మెరుపులతో లక్నో టార్గెట్‌ను ఛేదించింది.
213 పరుగుల భారీ టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ చేపట్టిన లక్నో రెండో ఓవర్‌లోనే కైల్ మేయర్స్ వికెట్ కోల్పోయింది. పరుగులు ఖాతా తెరవకుండా అతడు పెవిలియన్ చేరుకున్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడటం, దీపక్ హుడా, కృనాల్ పాండ్య అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంతో 23 పరుగులకు లక్నో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో మార్కస్ స్టోయినస్ లక్నో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు. 30 బాల్స్‌లో ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 65 రన్స్ చేశాడు.
15 బాల్స్‌లో హాఫ్ సెంచరీ..
ఆ జోరును కొనసాగించిన నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లతో బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించాడు. కేవలం 15 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 19 బాల్స్‌లో ఏడు సిక్సర్లు, 4 ఫోర్లతో 62 రన్స్ చేశాడు. బదోని 30 రన్స్‌తో రాణించడంతో లక్నో ఈజీగా టార్గెట్ ఛేదించేలా కనిపించింది. పూరన్‌తో పాటు బదోనీ ఔట్ కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
చివరి ఓవర్‌లో ఐదు పరుగులు అవసరం కాగా హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడమే కాకుండా మార్క్‌వుడ్, జయదేవ్ ఉనద్కత్ వికెట్ల తీయడంతో బెంగళూరు గెలిచేలా కనిపించింది. చివరి బాల్‌కు ఒక పరుగు అవసరం కాగా హర్షల్ వేసిన ఫుల్ టాస్ బాల్‌ను మిస్ చేసిన ఆవేశ్‌ఖాన్ తెలివిగా బైస్ ద్వారా సింగిల్ తీసి లక్నోకు విజయాన్ని అందించాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు.
కోహ్లి...డుప్లెసిస్...
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ మెరుపులతో భారీ స్కోరు చేసింది. కోహ్లి 44 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 61 రన్స్ చేయగా డుప్లెసిస్ 46 బాల్స్‌లో ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 79 రన్స్ చేశాడు. చివరలో మ్యాక్స్‌వెల్ 29 బాల్స్‌లోనే ఆరు సిక్సర్లు మూడు ఫోర్లతో 59 రన్స్ చేయడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది.