Mumbai vs Hyderabad: హైదరాబాద్‌పై ముంబయి ఘన విజయం.. దంచికొట్టిన కేమరూన్, రోహిత్
21 May 2023, 19:46 IST
- Mumbai vs Hyderabad: వాంఖడే వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముంబయి బ్యాటర్లు కేమరూన్ గ్రీన్ సెంచరీతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ అర్ధశతకంతో రాణించాడు. ఫలితంగా రెండు ఓవర్లు మిగిలుండగానే గెలిచింది.
హైదరాబాద్‌పై ముంబయి విజయం
Mumbai vs Hyderabad: ఐపీఎల్ 2023లో ముంబయి ఇండియన్స్ తన ప్లేఆఫ్స్ ఆశలను మరింత బలపరచుకుంది. ఆదివారం నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్లేఆఫ్స్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. హైదరాబాద్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 2 ఓవర్లు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబయి బ్యాటర్ కేమరూన్ గ్రీన్(100*) సెంచరీతో విజృంభించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(56) అర్ధశతకంతో రాణించాడు. సన్‌రైజర్స్ బౌలర్లు మరో సారి తమ పేలవ ప్రదర్శనతో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భువనేశ్వర్ కుమార్, మయాంక్ డ్యాగర్ చెరో వికెట్ మాత్రమే తీయగలిగారు.
201 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ముంబయి జట్టుకు శుభారంభమే దక్కలేదు. ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను(14) మూడో ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేమరూన్ గ్రీన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రోహిత్‌తో కలిసి అద్భుతంగా ఆడాడు. బౌలర్లే లక్ష్యంగా బౌండరీల వర్షాన్ని కురిపంచారు. పైపెచ్చు హైదరాబాద్ బౌలర్లు వేసిన నోబాల్స్‌ను బాగా వినియోగించుకుని ధారళంగా పరుగులు రాబట్టారు.
ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. వేగంగా బ్యాటింగ్ చేసి ముంబయి విజయాన్ని మొదటి 10 ఓవర్లలోనే ఖరారు చేశారు. అప్పటికే ఆ జట్టు కేవలం ఒకే వికెట్ కోల్పోయి 100 పరుగుల స్కోరును అధిగమించింది. రోహిత్, కేమరూన్ గ్రీన్ ఇద్దరూ ఉన్నంత సేపు పరుగుల ప్రవహాన్ని సృష్టించారు. 37 బంతుల్లో 56 పరుగులతో హిట్ మ్యాన్ ఆకట్టుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది. ధాటిగా ఆడుతున్న రోహిత్‌ను మయాంక్ డ్యాగర్ ఔట్ చేశాడు. దీంతో 128 పరుగుల వీరి భాగస్వామ్యానికి చెక్ పడింది.
అయితే అప్పటికే జరగాల్సిన నష్ట జరిగిపోయింది. సూర్యకుమార్ యాదవ్(25)తో కలిసి కేమరూన్ గ్రీన్ మిగిలిన కార్యాన్ని పూర్తి చేశాడు. 7.5 ఓవర్లలోనే ముంబయి ఇండియన్స్ స్కోరును సమం చేసింది. ఇంకో పరుగు చేస్తే కేమరూన్ గ్రీన్ సెంచరీ మార్కును అందుకోవాల్సి ఉండగా.. ఆ ఆఖరు బంతికి సింగిల్ తీసి శతకాన్ని పూర్తి చేస్తాడు. ఫలితంగా అతడి సెంచరీతో పాటు ముంబయి కూడా విజయాన్ని సాధిస్తుంది. కేమరూన్ గ్రీన్‌కు ఐపీఎల్‌లో ఇదే మొదటి శతకం. అసలు టీ20ల్లోనే మొదటి సెంచరీ.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు వివ్రాంత్ శర్మ(69), మయాంగ్ అగర్వాల్(83) ధాటిగా రాణించి తమ జట్టు 200 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తారు. 140 పరుగుల భాగస్వామ్యాన్ని ఈ జోడీ నమోదు చేయడంతో ఇంకా ఎక్కువ స్కోరే సన్‌రైజర్స్ నమోదు చేయాల్సి ఉండగా.. పదే పదే వికెట్లు కోల్పోవడంతో అనుకున్నదానికంటే తక్కువ స్కోరే నమోదు చేసింది.