తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lsg Vs Pbks: ఐపీఎల్‌ చరిత్రలో లక్నో సరికొత్త రికార్డు.. రెండో అత్యధిక స్కోరు నమోదు

LSG vs PBKS: ఐపీఎల్‌ చరిత్రలో లక్నో సరికొత్త రికార్డు.. రెండో అత్యధిక స్కోరు నమోదు

28 April 2023, 22:15 IST

google News
    • LSG vs PBKS: లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్‌‌లో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 257 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఐపీఎల్ చరిత్రలో లక్నో సరికొత్త రికార్డు
ఐపీఎల్ చరిత్రలో లక్నో సరికొత్త రికార్డు (AFP)

ఐపీఎల్ చరిత్రలో లక్నో సరికొత్త రికార్డు

LSG vs PBKS: ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. టోర్నీ హిస్టరీలోనే రెండో అత్యధిక స్కోరును సాధించింది లక్నో సూపర్ జెయింట్స్. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా మార్కస్ స్టాయినీస్ 40 బంతుల్లో 72 పరుగులతో విజృభించగా.. కైల్ మేయర్స్ 24 బంతుల్లో 54 పరుగులతో చెలరేగాడు. వీరికి తోడు ఆయుష్ బదోనీ, నికోలస్ పూరన్ మెరుపులు మెరిపించడంతో లక్నో భారీ స్కోరు సాధించగలిగింది. ముఖ్యంగా పంజాబ్ స్టార్ బౌలర్లయిన రబాడా, అర్ష్‌దీప్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని విజృంభించారు. రబాడా 2 వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, సామ్ కరన్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్‌ తగిన మూల్యం చెల్లించుకుంది. ఏదో బౌండరీలు కొట్టుకోమనేలా పేలవంగా బౌలింగ్ చేసి భారీగా పరుగులు సమర్పించుకున్నారు పంజాబ్ బౌలర్లు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ వెంటనే ఔటైనప్పటికీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆయుష్ బదోనీ, స్టాయినీస్, నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫలితంగా ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోరును నమోదు చేశారు.

2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 263 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. తాజాగా లక్నో 257 పరుగులతో రెండో స్థానంలో ఉంది. లక్నో బ్యాటర్లలో స్టాయినీస్ 40 బంతుల్లో 72, కైల్ మేయర్స్ 24 బంతుల్లో 54, నికోలస్ పూరన్ 19 బంతుల్లో 45 పరుగుులు, ఆయుష్ బదోనీ 24 బంతుల్లో 43 పరుగులతో ఆకట్టుకున్నారు.

తదుపరి వ్యాసం