CSK vs GT IPL Final: వర్షంతో ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రిజర్వ్ డే రోజు వర్షం పడితే గుజరాత్‌దేనా టైటిల్?
29 May 2023, 6:18 IST
CSK vs GT IPL Final: వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదాపడింది. ఒకవేళ సోమవారం కూడా వర్షం పడితే విజేత ఎవరంటే...
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
CSK vs GT IPL Final: ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ హోరాహోరీ బ్యాటింగ్ మెరుపుల్ని చూడాలని ఉత్సాహంగా ఎదురుచూసిన క్రికెట్ అభిమానులకు వర్షం నిరాశను మిగిల్చింది. భారీ వర్షం కారణంగా ఆట సాధ్యం కాకకపోవడంతో ఐపీఎల్ ఫైనల్‌ను రిజర్వ్ డేకు వాయిదావేశారు.
సోమవారం (నేడు) ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఒకవేళ సోమవారం కూడా వర్షం వల్ల ఆట నిర్వహణ పూర్తిగా సాధ్య పడని పక్షంలో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో నిలిచిన గుజరాత్ టైటాన్స్‌ను విన్నర్‌గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగాల్సి వుంది.
కానీ రాత్రి పన్నెండు గంటల వరకు అహ్మదాబాద్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురియడంతో అంపైర్లు మ్యాచ్‌ను రిజర్వ్ డేకు వాయిదావేశారు. 11 గంటల తర్వాత కాస్త వర్షం తగ్గుముఖం పట్టినా స్టేడియంలో నీరు ఎక్కువగా నిలువ ఉండటంతో మ్యాచ్ నిర్వహణ కుదరదని తేల్చిచెప్పిన అంపైర్లు మ్యాచ్‌ను రిజర్వ్ డేకు పోస్ట్‌పోన్ చేశారు.
సోమవారం కూడా వర్షం పడితే...
సోమవారం కూడా వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఐపీఎల్ లీగ్ స్టేజ్‌లో అద్భుత విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో నిలిచిన గుజరాత్‌ను విజేతగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వర్షం తగ్గి మినిమం ఐదు ఓవర్లు ఆటసాధ్యమైనా మ్యాచ్ ద్వారా విజేత ఎవరన్నది డిసైడ్ అవుతుంది. ఒకవేళ అది జరగకపోతే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అది కూడా సాధ్యం కానీ పక్షంలో మాత్రమే పాయింట్స్ ద్వారా గుజరాత్‌కు టైటిల్ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.