IPL 2023 Points Table: పాయింట్ల టేబుల్లో దూసుకెళ్లిన కేకేఆర్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్లూ మారిపోయారు
10 April 2023, 14:05 IST
- IPL 2023 Points Table: పాయింట్ల టేబుల్లో కేకేఆర్ దూసుకెళ్లింది. వరుసగా రెండు సంచలన విజయాలతో ఆ టీమ్ రెండోస్థానానికి వెళ్లడం విశేషం. అటు ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్లూ మారిపోయారు.
శిఖర్ ధావన్
IPL 2023 Points Table: ఐపీఎల్ పాయింట్ల టేబుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం (ఏప్రిల్ 9) సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తర్వాత టేబుల్లో స్థానాలు తారుమారయ్యాయి. ఆదివారం డబుల్ హెడర్ కాగా.. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై సంచలన విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్.. రెండోస్థానానికి దూసుకెళ్లడం విశేషం.
తొలి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఆ టీమ్ 3 మ్యాచ్ లలో రెండు గెలిచింది. ఆ టీమ్ నెట్ రన్‌రేట్ 2.067గా ఉంది. టాప్ సిక్స్ లో ఉన్న అన్ని టీమ్స్ రెండేసి విజయాలు సాధించినా రాయల్స్ నెట్ రన్‌రేట్ అందరి కంటే మెరుగ్గా ఉండటంతో టాప్ లో కొనసాగుతోంది. ఇక కేకేఆర్ రెండు వరుస విజయాలతో 1.375 నెట్ రన్‌రేట్ తో రెండోస్థానంలో ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్ ను ఓడించి సీజన్ లో తొలి విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ పదో స్థానంలో, రెండింట్లోనూ ఓడిన ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో ఉన్నాయి. సీఎస్కే, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఆరెంజ్ క్యాప్ లీడర్ ధావన్
సన్ రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడినా కూడా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఒంటరి పోరాటంతో 99 రన్స్ చేసిన విషయం తెలుసు కదా. ఈ ఇన్నింగ్స్ తో అతడు ఆరెంజ్ క్యాప్ లిస్టులో టాప్ లోకి దూసుకెళ్లాడు. ఈ సీజన్ లో ధావన్ మూడు మ్యాచ్ లలో 225 రన్స్ చేయడం విశేషం. మరోవైపు సీఎస్కే బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 189 రన్స్ తో రెండోస్థానానికి పడిపోయాడు. వార్నర్ (158) మూడు, బట్లర్ (152) నాలుగు, కైల్ మేయర్స్ (139) ఐదో స్థానంలో ఉన్నారు.
పర్పుల్ క్యాప్ లో రషీద్ ఖాన్
ఇక కేకేఆర్ తో మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా ఉన్న రషీద్ ఖాన్.. పర్పుల్ క్యాప్ లిస్టులో టాప్ లో ఉన్నాడు. అతడీ మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించి టాప్ లోకి దూసుకెళ్లాడు. రషీద్ మూడు మ్యాచ్ లలో 8 వికెట్లు తీశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజువేంద్ర చహల్ కూడా మూడు మ్యాచ్ లలో 8 వికెట్లతో రెండో స్థానంలో, లక్నో బౌలర్ మార్క్ వుడ్ 8 వికెటలతో మూడోస్థానంలో కొనసాగుతున్నారు.