KKR vs CSK: చెన్నైకి షాకిచ్చిన నితీష్ రానా, రింకు సింగ్ - కోల్‌కతాప్లేఆఫ్స్ ఆశలు సజీవం
15 May 2023, 6:14 IST
KKR vs CSK: నితీష్ రానా, రింకు సింగ్ అసమాన బ్యాటింగ్‌తో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.
నితీష్ రానా, రింకు సింగ్
KKR vs CSK: ప్లేఆఫ్స్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్స్, బౌలర్లు సమిష్టిగా రాణించారు. బౌలింగ్‌లో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, బ్యాటింగ్‌లో నితీష్ రానా, రింకు సింగ్ మెరుపులు మెరిపించడంతో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని సాధించింది.
ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 144 పరుగులు మాత్రమే చేసింది. శివమ్ దూబే 34 బాల్స్‌లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 48 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. కాన్వే 30 రన్స్, జడేజా 20 రన్స్‌తో రాణించడంతో చెన్నై ఈ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో నరైన్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
సింపుల్ టార్గెట్‌తో బరిలో దిగిన కోల్‌కతా ఆరంభంలోనే మూడు వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. జేసన్ రాయ్, రహ్మనుల్లా గుర్భాజ్, వెంకటేష్ అయ్యర్ స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. కష్ట సమయంలో కెప్టెన్ నితీష్ రానా, రింకు సింగ్ హాఫ్ సెంచరీలతో కోల్‌కతాను ఆదుకున్నారు.
నితీష్ రానా 44 బాల్స్‌లో ఆరు ఫోర్లు ఒక సిక్సర్‌తో 57 రన్స్ చేయగా, రింకు సింగ్ 43 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 54 రన్స్‌తో కోల్‌కతాకు విజయాన్ని అందించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో కోల్‌కతా తన ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలిచాయి.
మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా చెన్నై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించేది. కానీ ఓటమితో మరో మ్యాచ్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఏర్పడింది.