CSK vs GT: బోణీ అదిరింది - ఆరంభ మ్యాచ్‌లో సీఎస్‌కేను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్
01 April 2023, 6:27 IST
CSK vs GT: ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చిత్తు చేసింది. శుభ్‌మన్‌గిల్ హాఫ్ సెంచరీతో గుజరాత్‌కు విజయాన్ని అందించాడు.
హార్దిక్ పాండ్య
CSK vs GT: ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ బోణీ చేసింది. శుక్రవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సాధించింది. శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో గుజరాత్‌ను గెలిపించాడు. గిల్‌తో పాటు వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్ రాణించడంతో మరో నాలుగు బాల్స్ మిగిలుండగానే గుజరాత్ టార్గెట్‌ను చేరుకున్నది.
179 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు సాహా, శుభ్‌మన్ గిల్ మెరుపు ఆరంభాన్ని అందించారు. సాహ 16 బాల్స్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 25 రన్స్ చేసి ఔటయ్యాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ ఫోర్లు, సిక్సర్లతో ధాటిగా ఆడాడు. కేవలం 36 బాల్స్‌లోనే మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 63 రన్స్ చేశాడు. కీలక సమయంలో శుభ్‌మన్ గిల్‌తో పాటు హార్దిక్ పాండ్య ఔట్ కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
కానీ విజయ్ శంకర్ 21 బాల్స్‌లో 27 రన్స్‌తో పాటు రాహుల్ తెవాతియా (15 రన్స్), రషీద్‌ఖాన్ (10 పరుగులు) సమిష్టిగా రాణించి గుజరాత్‌కు విజయాన్ని అందించారు. చెన్నై బౌలర్లలో రాజవర్ధన్ హంగర్గేకర్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇరవైఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 178 రన్స్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (50 బాల్స్‌లో 92 రన్స్) ఒంటరి పోరాటంతో చెన్నై మెరుగైన స్కోరు చేసింది. గుజరాత్ బౌలర్లలో షమీ, అల్జెరీ జోసెఫ్, రషీద్‌ఖాన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. రషీద్‌ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.