MI vs LSG: ఆకాష్ దెబ్బకు లక్నో విలవిల -ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై స్టన్నింగ్ విక్టరీ
25 May 2023, 6:28 IST
MI vs LSG: ముంబై పేసర్ ఆకాష్ మధ్వాల్ విజృంభణతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో చిత్తయింది. 81 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓటమి పాలై ఐపీఎల్ 2023 నుంచి నిష్క్రమించింది.
రోహిత్ శర్మ
MI vs LSG: లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ లలో హిట్టర్లు ఎక్కువగా ఉండటంతో ఈ రెండు జట్ల మధ్య ఎలిమినేటర్ పోరు హోరాహోరీగా సాగుతుందని క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. కానీ ముంబై బౌలర్ ఆకాశ్ మధ్వాల్ జోరుతో మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా మారిపోయింది. బుధవారం చెన్నై వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
గత సీజన్‌లోనూ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమి పాలై ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన లక్నో ఈ సీజన్ నుంచి అదే రీతిలో వైదొలిగింది. ముంబై పేసర్ ఆకాష్ మధ్వాల్ సంచలన బౌలింగ్‌తో ముంబైకి అద్భుత విజయాన్ని అందించాడు.
3.3 ఓవర్లలో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు ఆకాష్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 182 రన్స్ చేసింది.
గ్రీన్ (23 బాల్స్‌లో ఆరు ఫోర్లు ఒక సిక్సర్‌తో 41 రన్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 33, తిలక్ వర్మ 26, నేహల్ వధేరా 22 రన్స్‌తో రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ నాలుగు వికెట్లు తీయగా, యశ్ ఠాకూర్ మూడు వికెట్లను సొంతం చేసుకున్నాడు.
183 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన లక్నో 16. 3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. స్టోయినిస్ (27 బాల్స్‌లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 40 రన్స్) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ ముంబై బౌలర్లను ఎదురించి క్రీజులో నిలబడలేకపోవడంతో లక్నో దారుణ పరాజయాన్ని చవిచూసింది.
లక్నో బ్యాట్స్‌మెన్స్‌లో ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. లక్నో ఓటమిని శాసించిన ముంబై పేసర్ ఆకాష్ మధ్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్ శుక్రవారం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ఫైనల్లో చెన్నైతో తలపడుతుంది.