Sourav Ganguly Birthday : పారిపోయి పెళ్లి చేసుకున్న గుంగూలీ.. ఇదిగో దాదా లవ్ స్టోరీ
17 April 2024, 17:02 IST
- Happy Birthday Sourav Ganguly : భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సౌరవ్ గంగూలీ పుట్టినరోజు(జూలై 8, 1972) నేడు. సౌరవ్ పెళ్లి చాలా గురించి చాలా ఆసక్తిగా ఉంటుంది. తన చిన్ననాటి స్నేహితురాలు డోనాతో అద్భుతమైన ప్రేమకథ నడిపించాడు దాదా.
సౌరవ్ గంగూలీ-డోనా పెళ్లి నాటి ఫొటో
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బర్త్ డే(Sourav Ganguly Birthday) నేడు. భారత క్రికెట్‌కు కొత్త వెలుగును అందించిన ఘనత గంగూలీకే దక్కుతుంది. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేలా చేసిన ఈ బెంగాలీ దాదా క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన పుట్టినరోజు రోజు సందర్భంగా.. సౌరవ్ గంగూలీ-డోనా రొమాంటిక్ లవ్ స్టోరీ(Sourav Ganguly-Dona Ganuly Love Story) గురించి తెలుసుకుందాం.
ఒక్కొక్కరి ప్రేమకథలు ఒక్కలా ఉంటాయి. ఎన్నో ప్రేమ కథలు విన్నాం, చదివాం. ఒక్కొక్కటి ఒక్కో విధంగా అనిపిస్తుంది. వాటి గురించి చదవడం, వినడం కాస్త ఇంట్రస్టింగ్ గా కూడా ఉంటుంది. క్రికెట్ ప్రపంచంలో కూడా ఇలాంటి అద్భుతమైన ప్రేమకథలు ఉన్నాయి. అందులో ఒకటి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ - డోనా ప్రేమకథ.
సౌరవ్ గంగూలీ, డోనా ప్రేమ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జంటకు పెళ్లయి 26 ఏళ్లు. మరో విశేషమేమిటంటే ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. డోనా అంటే తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమని గంగూలీ వెల్లడించాడు. డోనాను చూసేందుకు గంగూలీ ఆమె ఇంటి ముందు నడుస్తూ ఉండేవాడు. కానీ డోనా తండ్రి చాలా క్రమశిక్షణ గల వ్యక్తిగా కనిపించేవాడు.
తన స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడేందుకు వెళ్లేవాడు దాదా. పొలానికి దగ్గరలో దారి ఉన్నప్పటికీ, డోనాను చూసేందుకు ఆమె ఇంటి నుంచి నడిచి వెళ్లేవాడు గంగూలీ. ఒకసారి డోనా ఇంట్లోకి షటిల్ కాక్ విసిరిన గంగూలీ.. ఆమెతో మాట్లాడాడు. ఈ సమయంలోనే ఇద్దరు మొదటిసారి డేట్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
డోనా, గంగూలీ తమ మొదటి డేట్‌కి చైనీస్ రెస్టారెంట్‌కి వెళ్లారు. ఆ తర్వాత రహస్యంగా డేటింగ్ చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఈ సమయంలోనే, సౌరవ్ గంగూలీ ఇంగ్లండ్‌తో జరిగిన చారిత్రాత్మక లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లాడు.
అయితే గంగూలీ ఇంగ్లండ్ వెళ్లే ముందు డోనా ఇంట్లో తన ప్రేమ గురించి చెప్పాడు. ఆమె తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. డోనా తల్లిదండ్రులు దీన్ని వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లికి అంగీకరించమని చెప్పారు. అందుకే వీరిద్దరూ రహస్యంగా డేటింగ్‌లో ఉన్నారు. ప్రేమ వివాహాన్ని డోనా తల్లిదండ్రులే కాదు, గంగూలీ ఇంట్లో కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో గంగూలీ, డోనా వారి స్నేహితుల సహాయంతో రహస్య ప్రదేశంలో 21 ఫిబ్రవరి 1997న వివాహం చేసుకున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తమ పెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు. చాలా నెలలుగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పారు. అప్పుడు ఇరు కుటుంబాలు ఆగ్రహించినా.. ఇక చేసేదేమీలేక అంగీకరించాల్సి వచ్చింది. ఈ దంపతులకు సనా గంగూలీ అనే కుమార్తె ఉంది.