Gavaskar on Yashasvi: యశస్వీ అంతర్జాతీయ అరంగేట్రానికి రెడీ..! ఎందుకు ఎంపిక చేయాలో చెప్పిన గవాస్కర్
19 May 2023, 20:16 IST
- Gavaskar on Yashasvi: రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అతడిని సెలక్టర్లు ఎందుకు ఎంపిక చేయాలో కూడా వివరించారు.
యశస్వీ జైస్వాల్
Gavaskar on Yashasvi: రాజస్థాన్ రాయల్స్‌కు ఈ సీజన్ పెద్దగా కలిసి రాలేదు. ఆరంభంలో అదరగొట్టిన ఈ జట్టు.. ఆ తర్వాత వరుస పరాజయాలతో వెనకబడింది. మొదటి 6 మ్యాచ్‌ల్లో నాలుగించిలో గెలిచిన రాజస్థాన్.. చివరి 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే విజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఫలితంగా ప్లేఆఫ్స్‌లో నిలవాలంటే ఇతర జట్ల రిజల్ట్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం తన చివరి లీగ్ మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. ఇదిలా ఉంటే ఈ జట్టు నుంచి ప్రతిభావంతుడైన బ్యాటర్ వెలుగులోకి వచ్చాడు. అతడే యశస్వీ జైస్వాల్. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు టీమిండియాలో వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే విషయాన్ని భారత మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ కూడా స్పష్టం చేశారు.
"టీ20ల్లో 20-25 బంతుల్లో బ్యాటర్ 40 నుంచి 50 పరుగులు చేస్తే జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అదే అతడు ఓపెనర్ అయితే.. 15 ఓవర్లు ఆడితే సెంచరీ చేసే అవకాశముంటుంది. ఫలితంగా జట్టు 190 నుంచి 200 పరుగుల మార్కును అందుకుంటుంది. అలాగే ఈ సీజన్‌లో యశస్వీ జైస్వాల్ ఆడాడు. అతడు తన బ్యాటింగ్‌తో నన్ను సంతోషపెట్టాడు. అతడు టెక్నికల్ బ్యాటర్." అని సునీల్ గవాస్కర్ అన్నారు.
టీమిండియాలో యశస్వీకి ఛాన్స్ ఇవ్వాలని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. "యశస్వీ టీమిండియాలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆటగాడు ఫామ్‌లో ఉన్నప్పుడు ఛాన్స్ ఇస్తే అతడి ఆత్మవిశ్వాసం ఆకాశాన్నంటుంది. ముఖ్యంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అవకాశమిస్తే మెరుగ్గా రాణిస్తారు. అయితే ఇంటర్నేషనల్ డెబ్యూ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికీ ఓ సందేహం ఉంటుంది. నేను అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నానా? అని ప్రశ్నించుకుంటారు. ఆ సమయంలో ఫామ్ మంచిగా ఉంటే.. ఆ సందేహం ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఫామ్‌లో ఉండటం చాలా ముఖ్యం" అని గవాస్కర్ స్పష్టం చేశారు.
యశస్వీ జైస్వాల్ ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 575 పరుగులు చేసి ఇప్పటి వరకు ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(707), గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్(576) ఉన్నారు.