Dhoni Refuses Autograph To Chahar: దీపక్ చాహర్‌కు ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించిన ధోనీ - వీడియో వైరల్
30 May 2023, 13:16 IST
Dhoni Refuses Autograph To Chahar: చెన్నై పేసర్ దీపక్ చాహర్‌కు ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి ధోనీ నిరాకరించాడు. సరదాగా అతడిని ర్యాగింగ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీపక్ చాహర్, ధోనీ
Dhoni Refuses Autograph To Chahar: సోమవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విజయాన్ని సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్‌ను సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. చెన్నై కెప్టెన్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో కప్ గెలిచి టీమ్ మెంబర్స్ అతడికి అదిరిపోయే బహుమతిని ఇచ్చారు.
తమ జట్టు కప్ గెలవడంతో ధోనీ కూడా ఆనందంలో మునిగిపోయాడు. సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించిన జడేజాను ఎత్తుకొని గెలుపు సంబరాలు చేసుకున్నాడు. విన్నింగ్ సెలబ్రేషన్స్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్నది. చెన్నై గెలిచిన ఆనందంలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీని చెన్నై పేసర్ దీపక్ చాహర్ జెర్సీపై ఆటోగ్రాఫ్ అడిగాడు.
కానీ ధోనీ మాత్రం అతడికి ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీపక్ చాహర్ చాలా సేపు బతిమిలాడినా ధోనీ మాత్రం అతడిని అక్కడి నుంచి వెళ్లు అన్నట్లుగా చేతులతో సైగ చేస్తూ ఆటపట్టించాడు తప్పితే ఆటోగ్రాఫ్ ఇవ్వలేదు.
ఆటోగ్రాఫ్ ఇవ్వకపోవడానికి గల కారణాల్ని పక్కనే ఉన్న రాజీవ్ శుక్లాతో చెబుతూ దీపక్ చాహర్‌ను ధోనీ సరదాగా ర్యాగింగ్ చేశారు. చివరరకు దీపక్ చాహర్ జెర్సీపై ధోనీ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. చాహర్‌ను ధోనీ ర్యాగింగ్ చేసిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫైనల్ మ్యాచ్‌లో చాహర్ నాలుగు ఓవర్లు వేసి ముప్పై ఎనిమిది రన్స్ ఇచ్చాడు. అంతే కాకుండా సెకండ్ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను చాహర్ డ్రాప్ చేశాడు. ఆ తర్వాత తన బౌలింగ్‌లోనే సాహా ఇచ్చిన మరో సింపుల్ క్యాచ్‌ను కూడా దీపక్ చాహర్ వదిలివేశాడు.
అందుకు పనిష్‌మెంట్‌గానే ధోనీ అతడికి ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించినట్లు చెబుతోన్నారు. ఐపీఎల్ 2023లో పది మ్యాచ్‌లు ఆడిన దీపక్ చాహర్ పదమూడు వికెట్ల దక్కించుకున్నాడు.