తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Media Rights: ఒక్కో మ్యాచ్‌కు రూ.100 కోట్లు దాటిన బిడ్‌

IPL Media Rights: ఒక్కో మ్యాచ్‌కు రూ.100 కోట్లు దాటిన బిడ్‌

Hari Prasad S HT Telugu

13 June 2022, 6:39 IST

google News
    • ఊహించినట్లే ఐపీఎల్‌ మీడియా హక్కుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. బరిలో స్టార్‌, సోనీ, రిలయెన్స్‌లాంటి దిగ్గజాలు ఉండటంతో ఆదివారమే ఒక్కో మ్యాచ్‌ బిడ్‌ రూ.100 కోట్లు దాటడం విశేషం.
టాటా ఐపీఎల్ ట్రోఫీ
టాటా ఐపీఎల్ ట్రోఫీ (PTI)

టాటా ఐపీఎల్ ట్రోఫీ

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఇప్పుడు బంగారు బాతులాంటిది. ప్లేయర్స్‌ నుంచి బీసీసీఐ, ఫ్రాంఛైజీలు, స్పాన్సర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ ఐపీఎల్‌ మ్యాచ్‌లను లైవ్‌ బ్రాడ్‌కాస్ట్‌ చేయడానికి బడా కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఆదివారం ఈ మీడియా హక్కుల కోసమే బీసీసీఐ ఈ-వేలం ప్రారంభించింది. రెండు రోజుల పాటు సాగనున్న ఈ-వేలంలో ఆదివారం ముగిసే సమయానికే బిడ్‌ విలువ రూ.43 వేల కోట్లు దాటడం గమనార్హం.

అంటే ఇటు టీవీ, అటు డిజిటల్‌ హక్కుల డబ్బు కలిపితే.. ఐపీఎల్ ఒక్కో మ్యాచ్‌కు రూ.100 కోట్లపైనే అయింది. 2023-27 మధ్య ఐదేళ్ల పాటు ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులను సొంతం చేసుకోవడానికి కంపెనీలు ఈ-వేలంలో పాల్గొంటున్నాయి. వేలం సోమవారం కూడా కొనసాగనున్న నేపథ్యంలో ఈ మొత్తం రూ.50 వేల ఓట్లను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీవీ, డిజిటల్‌, స్పెషల్‌ మ్యాచ్‌లు, విదేశాల్లో బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులు అంటూ మొత్తం నాలుగు విభాగాల్లో బీసీసీఐ బిడ్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం కలిపి బీసీసీఐ నిర్ణయించిన కనీస ధరనే రూ.32 వేలు కోట్లుగా ఉంది. 2017-22 మధ్య ఐదేళ్ల పాటు మీడియా హక్కులను సొంతం చేసుకున్న స్టార్‌ చెల్లించిన మొత్తం రూ.16348 కోట్లు మాత్రమే.

ఇప్పుడు బిడ్లు పూర్తయ్యే సమయానికి అన్నీ కలిపి సుమారు దీనికి మూడింతలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పోటీలో ఈ స్టార్‌ (డిస్నీ)తోపాటు రిలయెన్స్‌, సోనీ కూడా ఉన్నాయి. ప్రధానంగా పోటీ ఈ ముగ్గురి మధ్యే ఉందని న్యూస్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి. సోనీలో విలీనమవుతున్నట్లు ప్రకటించిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేరుగా బిడ్‌ దాఖలు చేయడం విశేషం.

ప్రస్తుతం ఐపీఎల్‌లో 10 టీమ్స్‌ కావడంతో మ్యాచ్‌ల సంఖ్య 74కు చేరింది. అయితే ఈ సైకిల్‌ చివరి రెండు సీజన్లలో ఈ మ్యాచ్‌ల సంఖ్యను 94 వరకూ పెంచనున్నట్లు కూడా బిడ్లను ఆహ్వానించే సమయంలో బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతానికి టీవీ హక్కుల కోసం కంపెనీలు దాఖలు చేసిన బిడ్లలో అత్యధికంగా ప్రతి మ్యాచ్‌కు రూ.55 కోట్లు కాగా.. డిజిటల్‌ హక్కుల్లో ప్రతి మ్యాచ్‌కు రూ.50 కోట్ల వరకూ చేరింది. ఈ రెండూ కలిపితే ఐపీఎల్‌ ప్రతి మ్యాచ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కుల విలువ ఆదివారానికే రూ.100 కోట్లు దాటింది. సోమవారం ఇది మరింత పెరిగే ఛాన్స్‌ ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం