Asian Games Hockey: హాకీలో భారత్‍కు స్వర్ణం.. ఫైనల్‍లో బంపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు క్వాలిఫై
06 October 2023, 18:42 IST
- Asian Games Hockey: భారత హాకీ జట్టు అదరగొట్టింది. ఫైనల్‍లో జపాన్‍ను చిత్తు చేసి.. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అలాగే, 2024 పారిస్ ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించింది.
Asian Games Hockey: హాకీలో భారత్‍కు స్వర్ణం.. ఫైనల్‍లో బంపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు క్వాలిఫై
Asian Games Hockey: భారత హాకీ జట్టు స్వర్ణ మెరుపులు మెరిపించింది. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. చైనాలోని హాంగ్జౌ వేదికగా నేడు (అక్టోబర్ 6) జరిగిన 19వ ఏషియన్ గేమ్స్ పురుషుల హాకీ ఫైనల్‍లో భారత్ 5-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ జపాన్‍పై భారీ విజయం సాధించింది. దీంతో టీమిండియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా చాంపియన్‍గా అవతరించింది. ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ టీమ్ బంగారు మెడల్ సాధించడం 2014 తర్వాత ఇదే తొలిసారి.
జపాన్‍తో ఈ ఏషియన్ గేమ్స్ ఫైనల్ మ్యాచ్‍లో భారత్ ప్లేయర్లు మన్‍ప్రీత్ సింగ్ (25వ నిమిషం), హర్మన్ ప్రీత్ సింగ్ (32వ, 59వ నిమిషాలు), అమిత్ రోహిదాస్ (36వ నిమిషం), అభిషేక్ (48వ నిమిషం) గోల్స్ చేసి సత్తాచాటారు. జపాన్ తరఫున సెరెన్ టనక (51వ నిమిషం) ఒక్కడే గోల్ కొట్టగలిగాడు. ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించడంతో 2024 పారిస్ ఒలింపిక్స్‌కు భారత పురుషుల హాకీ జట్టు నేరుగా అర్హత సాధించింది.
ఈ ఫైనల్ మ్యాచ్‍లో ప్రారంభం నుంచి జపాన్‍పై ఆధిపత్యం చూపింది టీమిండియా. అయినా చాలా సేపు గోల్ దక్కలేదు. అయితే, 25వ నిమిషంలో భారత ప్లేయర్ మన్‍ప్రీత్ సింగ్ రివర్స్ హిట్‍తో అద్భుతమైన గోల్ చేశాడు. 32వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‍గా మలిచాడు హర్మన్‍ప్రీత్. ఆ తర్వాత రోహిత్ దాస్ కూడా బాదటంతో 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత్.
36వ నిమిషంలో టీమిండియా ప్లేయర్ చూడచక్కని ఫ్లిక్‍తో గోల్ చేశాడు. ఆ తర్వాత జపాన్ ప్లేయర్ టనక ఎట్టకేలకు జపాన్ ఖాతా తెరిచాడు. 59వ నిమిషంలో హర్మన్ ప్రీత్ మరో గోల్ చేయడంతో 5-1 భారీ తేడాతో టీమిండియా గెలిచింది. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ప్రస్తుతం 19వ ఏషియన్ గేమ్స్‌లో భారత్‍కు ఇప్పటి వరకు (అక్టోబర్ 6, సాయంత్రం) 95 పతకాలు వచ్చాయి. ఇందులో 22 స్వర్ణాలు, 34 రజతాలు, 39 కాంస్యాలు ఉన్నాయి. ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్ తొలిసారి 100 పతకాల మార్క్ చేరడం కూడా పక్కా అయింది.