India vs Sri Lanka: లంకను చిత్తు చేసిన భారత్.. 2-1తో సిరీస్ కైవసం
07 January 2023, 22:37 IST
- India vs Sri Lanka: రాజ్ కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ 91 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేయలేక లంక జట్టు 137 పరుగులకే ఆలౌటైంది.
భారత్-శ్రీలంక
India vs Sri Lanka: శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక లంక జట్టు పరాజయం పాలైంది. 16.4 ఓవర్లలో కేవలం 137 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా భారత్ 91 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. లంక్ బ్యాటర్లలో దసున్ శనకా(23), కుశాల్ మెండీస్(23) తమ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశారు. వీరు మినహా మిగిలిన వారంతా విఫలం కావడంతో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లతో రాణించగా.. ఉమ్రాన్ మాలిక్, చాహల్, హార్దిక్ పాండ్య తలో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంకకు శుభారంభం దక్కినప్పటికీ చివరి వరకు ఆ దూకుడును కొనసాగించలేదు. ఓపెనర్లు పాథుమ్ నిశాంక(15), కుశాల్ మెండీస్ తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. అయితే అక్షర్ పటేల్ కుశాల్ మెండీస్‌ను ఔట్ చేసి టీమిండియాకు వికెట్ల ఖాతా తెరిచాడు. అప్పటి నుంచి శ్రీలంక బ్యాటర్లను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు భారత బౌలర్లు. ముఖ్యంగా గత మ్యాచ్‌లో నోబాల్స్ వేసి ఇబ్బంది పడిన అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్‌లో మాత్రం అద్భుత ప్రదర్శన చేశాడు. 2.4 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్, కెప్టెన్ దసున్ శనకా మినహా మిగిలినవారు పెద్దగా రాణించలేదు. భారత బౌలర్ల ధాటికి ప్రత్యర్థి బ్యాటర్లు పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. గట్టి భాగస్వామ్యం ఒక్కటి కూడా ఏర్పరచకుండానే లంక బ్యాటర్లను వెనక్కి పంపారు. ఫలితంగా శ్రీలంక జట్టు 16.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రీలంకపై భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులతో అదరగొట్టింది. ఆరంభంలో రాహుల్ త్రిపాఠి(35) అదరగొట్టగా.. అనంతరం సూర్యకుమార్ యాదవ్(112*) విధ్వంసం సృష్టించాడు. సూర్యకుమార్ 10 నెలలో పొట్టి ఫార్మాట్‌లో మూడో సెంచరీని అందుకున్నాడు. 51 బంతుల్లోనే 112 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇందులో 7 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. శుబ్‌మన్ గిల్ 46 పరుగులు చేసి కొద్దిలో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో మధుశంకా 2 వికెట్లు తీయగా.. రజితా, కరుణరత్నే, హసరంగా తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.