IND vs IRE: పసికూనే కానీ.. కసిగా ఆడింది.. ఉత్కంఠ పోరులో ఐర్లాండ్‌పై భారత్ విజయం
29 June 2022, 6:10 IST
- డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠ భరిత రెండో టీ20లో భారత విజయం సాధించింది. ఫలితంగా టీమిండియా సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఐర్లాండ్ ఓపెనర్లు ఆరంభంలో దూకుడుగా ఆడినప్పటి విజయం భారత్‌నే వరించింది.
ఐర్లాండ్‌పై భారత్ విజయం
ఐర్లాండ్‌తో జరిగిన చివరిదైన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో టీమిండియానే విజయం వరించింది. ఫలితంగా రెండు టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. డబ్లిన్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 225 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 221 పరుగులు చేసి తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్(40),ఆండ్రూ బల్బిర్నీ(60) అదిరిపోయే ప్రదర్శన చేసినప్పటికీ.. జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి భిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఆరంభం అదిరినా..
తొలుత టీమిండియా నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌కు బలమైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్, కెప్టెన్ ఆండ్రూ బల్బీర్నీ 5.4 ఓవర్లకే 72 పరుగులు జోడించారు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లోనే సిక్సర్ సహా మూడు ఫోర్లతో పాల్ స్టిర్లింగ్ విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించారు. అయితే ధాటిగా ఆడుతున్న పాల్ స్టిర్లింగ్‌ను రవి భిష్ణోయ్ బౌల్డ్ చేయడంతో తొలి వికెట్ పడింది. అయితే అప్పటికే జట్టు స్కోరు 5.4 ఓవర్లలో 72 పరుగులుగా ఉంది.
అనంతరం కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ గత మ్యాచ్‌లో అదరగొట్టిన హ్యారీ టెక్టార్(39) సాయంతో ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఎడపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలోనే 34 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇందులో 3 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే 11వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్.. ఆండ్రూను ఔట్ చేయడంతో అనంతరం స్కోరు కాస్త మందగించింది. చివర్లో జార్జ్ డాకెరెల్(34), మార్క్ అడేయిర్(23) దూకుడుగా ఆడినప్పటికీ టీమిండియానే విజయం వరించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా దీపక్ హుడా(104), సంజూ శాంసన్(77) కెరీర్‌లో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ అదరగొట్టారు. కెరీర్‌లో నాలుగో టీ20 ఆడుతున్న దీపక్ హుడా సెంచరీ చేయడం విశేషం. అతడు కేవలం 55 బాల్స్‌లోనే 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో మూడంకెల స్కోరు అందుకున్నాడు. మరోవైపు శాంసన్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ చేశాడు. అతడు 42 బాల్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 రన్స్ చేసి ఔటయ్యాడు. దీపక్ హుడా 57 బాల్స్‌లో 104 రన్స్ చేసి ఔటయ్యాడు. చివరి ఓవర్లలో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయి 225 పరుగులకే పరిమితమైంది. లేకుంటే ఇంకా మెరుగైన స్కోరు చేసి ఉండేది.
టాపిక్