India vs Pakistan: పాకిస్థాన్‍ను చిత్తు చేసిన భారత్.. ఛెత్రీ హ్యాట్రిక్ గోల్స్
21 June 2023, 22:28 IST
- India vs Pakistan: పాకిస్థాన్‍ను భారత ఫుట్‍బాల్ టీమ్ చిత్తుచేసింది. 4-0 తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. వివరాలివే..
ఛెత్రీని అభినందిస్తున్న భారత జట్టు సభ్యులు (Photo: Twitter / Indian Football Team)
India vs Pakistan: పాకిస్థాన్‍పై భారత ఫుట్‍బాల్ జట్టు ఘన విజయం సాధించింది. పాక్‍ను టీమిండియా చిత్తుగా ఓడించింది. సౌత్ ఏషియన్ ఫుట్‍బాల్ ఫెడరేషన్ (SAFF) చాంపియన్‍షిప్‍లో భాగంగా బుధవారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో భారత్ 4-0 తేడాతో పాకిస్థాన్‍ను ఓడించింది. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ మూడు గోల్‍లతో హ్యాట్రిక్ సాధించాడు. చివర్లో ఉదాంత సింగ్ ఓ గోల్ చేశాడు. మ్యాచ్ ఎలా సాగిందంటే..
మ్యాచ్ ఆరంభం నుంచి టీమిండియా దూకుడుగా ఆడింది. పాకిస్థాన్ టీమ్‍కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ 10వ నిమిషంలో పాక్ గోల్‍కీపర్‌ను చాకచక్యంగా బోల్తా కొట్టించిన భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ.. తొలి గోల్ చేశాడు. ఖాతా తెరిచి టీమిండియాను ఆధిక్యంలో నిలిపాడు. ఇక 16వ నిమిషంలో పెనాల్టీ అవకాశం రాగా.. దాన్ని గోల్‍గా మలిచాడు సారథి ఛెత్రీ. దీంతో భారత్ 2-0 ఆధిక్యానికి వెళ్లింది. ఫస్ట్ హాఫ్ టైమ్ వరకు మరో గోల్ నమోదు కాలేదు.
సెకండ్ హాఫ్‍లో భారత్, పాకిస్థాన్ తీవ్రంగా పోరాడాయి. అయితే 73వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ అవకాశాన్ని మరోసారి ఒడిసిపట్టుకున్నాడు భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ. పాక్ డిఫెండర్లను దాటించి బంతిని గోల్ పోస్టులోకి పంపాడు. దీంతో 3-0తో భారత్ దూసుకుపోయింది. హ్యాట్రిక్‍తో మరోసారి సత్తాచాటాడు ఛెత్రీ. ఇక 81వ నిమిషంలో భారత ప్లేయర్ ఉదాంత.. పాక్ గోల్‍కీపర్‌ను తికమక పెట్టి సునాయాసంగా గోల్ కొట్టాడు. దీంతో ఏకంగా 4-0తో పూర్తి ఆధిపత్యంతో పాకిస్థాన్‍పై టీమిండియా విజయం సాధించింది. పాకిస్థాన్‍ను భారత్ చిత్తు చేయడం వరుసగా ఇది ఏడోసారి.
ఆటగాళ్లు మధ్య గొడవ
మ్యాచ్ ఫస్ట్ హాఫ్ ముగిశాక భారత్, పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య మైదానంలోనే చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్లేయర్ నుంచి బాల్‍ను లాక్కునేందుకు ప్రయత్నించిన భారత కోచ్ ఇగోర్ స్టిమాక్‍కు రెడ్ కార్డు చూపించారు రెఫరీ. పాకిస్థాన్ మేనేజర్ కూడా ఎల్లో కార్డును ఎదుర్కొన్నాడు.