IND vs GER Live Streaming: నేడు ఇండియా, జర్మనీ హాకీ ఫైట్.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే.. స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీ
23 October 2024, 10:27 IST
- IND vs GER Live Streaming: భారత్, జర్మనీ మధ్య హాకీ సిరీస్ నేడు షురూ కానుంది. ఇరు జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్ సహా మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
IND vs GER Live Streaming: నేడు ఇండియా, జర్మనీ హాకీ ఫైట్.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే.. స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీ
జర్మనీతో పోరుకు భారత హాకీ జట్టు సిద్ధమైంది. ఇరు జట్లు రెండు మ్యాచ్‍ల సిరీస్ ఆడనున్నాయి. నేడు (అక్టోబర్ 23) తొలి మ్యాచ్ జరగనుండగా.. రేపు (అక్టోబర్ 24) రెండో పోరు ఉండనుంది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‍చంద్ నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్‍లు జరగున్నాయి. ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్ సెమీస్‍లో టీమిండియాను జర్మనీ ఓడించి దెబ్బకొట్టింది. దీంతో భారత్ ప్రతీకారంతో ఉంది.
మేజర్ ధ్యాన్‍చంద్ స్టేడియంలో పదేళ్ల తర్వాత ఓ అంతర్జాతీయ హాకీ మ్యాచ్ జరగనుంది. ఇక్కడ చివరగా 2014 జనవరిలో హాకీ వరల్డ్ లీక్ ఫైనల్ జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, జర్మనీ హాకీ సిరీస్ వివరాలు ఇక్కడ చూడండి.
మ్యాచ్ టైమ్
భారత్, జర్మనీ మధ్య ఈ సిరీస్‍లో తొలి హాకీ మ్యాచ్ నేడు (అక్టోబర్ 23) మధ్యాహ్నం 3 గంటలకు మొదలుకానుంది.
లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు
భారత్, జర్మనీ మధ్య ఈ హాకీ సిరీస్ మ్యాచ్‍లు డీడీ స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్ నెట్‍వర్క్ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతాయి. టీవీలో ఆ ఛానెళ్లలో చూడొచ్చు. డిజిటల్ విషయానికి వస్తే, సోనీలివ్, ఫ్యాన్ కోడ్ ఓటీటీల్లో ఈ మ్యాచ్‍ల లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
ఫ్రీ టికెట్లు ఎలా పొందాలంటే..
భారత్, జర్మనీ మ్యాచ్‍ను ఢిల్లీ మేజర్ ద్యాన్‍చంద్ స్టేడియంలో ప్రజలు ఉచితంగా చూడొచ్చని హాకీ ఇండియా ప్రకటించింది. డిజిటల్ టికెటింగ్ సిస్టం ద్వారా స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీ ఉంటుందని తెలిపింది. స్టేడియంలో మ్యాచ్ చూడాలనుకునే వారు టికెట్‍జినీ (Ticketgenie) వెబ్‍సైట్ ద్వారా పాస్‍లను బుక్ చేసుకోవాలి. ఈ మ్యాచ్ కోసం స్టేడియంలో ప్రేక్షకులను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అనుమతి ఉంటుంది.
హెడ్ టూ హెడ్ రికార్డు
2013 తర్వాత భారత్, జర్మనీ 19 మ్యాచ్‍ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ ఎనిమిది మ్యాచ్‍ల్లో గెలిచింది. జర్మనీ ఏడింట్లో విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‍లు డ్రా అయ్యాయి. ఓవరాల్‍గా భారత్, జర్మనీ ఇప్పటి వరకు 107 హాకీ మ్యాచ్‍ల్లో పోటీ పడ్డాయి. ఇందులో 54సార్లు జర్మనీ గెలువగా.. భారత్ 26సార్లు విజయం సాధించింది. 27 డ్రా అయ్యాయి. అయితే, 2013 నుంచి టీమిండియానే జర్మనీపై ఆధిపత్యం చూపింది.
ఈ ఏడాది పారిస్ ఒలింపిక్ క్రీడల్లో పురుషుల హాకీ సెమీఫైనల్‍లో భారత్‍ను జర్మనీ 3-2 తేడాతో ఓడించింది. ఆ తర్వాత స్పెయిన్‍పై గెలిచి కాంస్య పతకాన్ని టీమిండియా దక్కించుకుంది. ఈ సిరీస్‍లో జర్మనీని చిత్తుచేసి ఒలింపిక్స్ పగను కాస్తైనా తీర్చుకోవాలనే కసితో హర్మన్ ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ ఉంది.