Ind vs Aus: హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 మ్యాచ్ ఎప్పుడో తెలుసా?
04 August 2022, 14:40 IST
- Ind vs Aus: చాలా ఏళ్ల తర్వాత మొత్తానికి ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ మన హైదరాబాద్‌కు వచ్చింది. ఈ ఏడాది ఇండియాలో ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా ఓ టీ20 మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.
ఉప్పల్ స్టేడియం
హైదరాబాద్: ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా బిజీబిజీగా గడపనుంది. ప్రస్తుతం వెస్టిండీస్ టూర్ తర్వాత జింబాబ్వేతో సిరీస్, ఆ తర్వాత ఆసియా కప్ ముగియగానే మళ్లీ సొంతగడ్డపై సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సిరీస్‌లు ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది. వీటిలో హైదరాబాద్‌కు ఓ మ్యాచ్ దక్కింది.
మొత్తంగా ఈ రెండు టీమ్స్‌తో కలిపి టీమిండియా ఆరు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మధ్యే ఇండియాకు వచ్చి వెళ్లిన సౌతాఫ్రికా అప్పుడు ఐదు టీ20ల సిరీస్ ఆడగా ఇప్పుడు మరోసారి మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుండటం విశేషం. ఆస్ట్రేలియాతో మాత్రం మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది. సెప్టెంబర్ 20 నుంచి 25 వరకూ మూడు టీ20ల సిరీస్ ఆస్ట్రేలియాతో జరుగుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకూ సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఉంటుంది.
ఇక సౌతాఫ్రికాతో అక్టోబర్ 6 నుంచి 11 వరకూ మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్ సూపర్ స్టేజ్ అక్టోబర్ 22న ప్రారంభమవుతుంది. దీంతో ఈ వన్డే సిరీస్‌లో పూర్తిస్థాయి టీమ్ ఆడుతుందా లేదా అన్నది చూడాలి. ఇక ఆస్ట్రేలియాతో సిరీస్ షెడ్యూల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
హైదరాబాద్‌లో ఇండియా vs ఆస్ట్రేలియా టీ20
సెప్టెంబర్ 20న ఆస్ట్రేలియాతో ఇండియా తొలి టీ20 మ్యాచ్ మొహాలీలో జరుగుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 23న నాగ్‌పూర్‌లో రెండో టీ20, సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో మూడో టీ20 జరుగుతుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో చివరిసారి 2019, డిసెంబర్ 6న ఓ టీ20 జరిగింది. అంటే సుమారు రెండేళ్ల 10 నెలల తర్వాత మరో ఇంటర్నేషనల్ టీ20కి హైదరాబాద్ వేదిక కానుంది.
సౌతాఫ్రికాతో సిరీస్ షెడ్యూల్ ఇదీ
ఇక సౌతాఫ్రికాతో మొదట మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది. సెప్టెంబర్ 28న తిరువనంతపురంలో తొలి టీ20, అక్టోబర్ 2న గువాహతిలో రెండో టీ20, అక్టోబర్ 4న ఇండోర్‌లో మూడో టీ20 జరుగుతుంది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విషయానికి వస్తే అక్టోబర్ 6న లక్నోలో తొలి వన్డే, అక్టోబర్ 9న రాంచీలో రెండో వన్డే, అక్టోబర్ 11న ఢిల్లీలో మూడో వన్డే జరుగుతుంది.