India home series schedule: హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో వన్డే.. ఇండియా హోమ్ సిరీస్ షెడ్యూల్ ఇదే
08 December 2022, 14:21 IST
- India home series schedule: హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో వన్డే జరగనుంది. ఇండియా హోమ్ సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం (డిసెంబర్ 8) రిలీజ్ చేసింది. ఇక వైజాగ్ లో ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ ఉంటుంది.
హోమ్ సీజన్ లో మూడు నెలల్లో మూడు టీమ్స్ తో సిరీస్ లు ఆడనున్న టీమిండియా
India home series schedule: టీమిండియా హోమ్ సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లు ఆడనుంది. ఈ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (డిసెంబర్ 8) బీసీసీఐ రిలీజ్ చేసింది. జనవరి 3న ప్రారంభమయ్యే ఈ సీజన్.. మార్చి 22 వరకూ సాగనుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఓ వన్డే మ్యాచ్ నిర్వహించే అవకాశం దక్కింది.
బంగ్లాదేశ్‌తో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టెస్ట్ సిరీస్ జరుగుతుంది. దాని తర్వాత టీమిండియా స్వదేశానికి వస్తుంది. న్యూఇయర్‌లో మొదట సిరీస్‌ను శ్రీలంకతో ఆడుతుంది. ఆ టీమ్ వెళ్లగానే న్యూజిలాండ్, ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్స్ ఇండియాలో అడుగుపెట్టనున్నాయి.
శ్రీలంక సిరీస్ షెడ్యూల్ ఇదే
టీమిండియా 2022-23 హోమ్ సీజన్ శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌తో ప్రారంభమవుతుంది. మొదట ఆ టీమ్‌తో మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది. జనవరి 3న ముంబైలో జరిగే తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జనవరి 5న పుణెలో రెండో టీ20, జనవరి 7న రాజ్‌కోట్‌లో మూడో టీ20 జరుగుతుంది.
ఇక ఆ వెంటనే మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 10న గువాహటిలో తొలి వన్డే జరుగుతుంది. ఇక జనవరి 12న కోల్‌కతాలో రెండో వన్డే, జనవరి 15న త్రివేండ్రంలో మూడో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో ఇండియాలో శ్రీలంక టూర్ ముగుస్తుంది.
న్యూజిలాండ్ సిరీస్ షెడ్యూల్ ఇదే..
శ్రీలంక వెళ్లిపోగానే ఇండియా టూర్‌కు న్యూజిలాండ్ రానుంది. మొదట ఆ టీమ్‌తో మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఇందులో భాగంగా జనవరి 18న హైదరాబాద్‌లో ఇండియా, న్యూజిలాండ్ తొలి వన్డే జరుగుతుంది. జనవరి 21న రెండో వన్డే రాయ్‌పూర్‌లో, జనవరి 24న మూడో వన్డే ఇండోర్‌లో ఉంటాయి.
ఇక ఆ తర్వాత న్యూజిలాండ్‌తోనే మూడు టీ20ల సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి టీ20 జనవరి 27న రాంచీలో, రెండో టీ20 జనవరి 29న లక్నోలో, మూడో టీ20 ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో జరుగుతాయి. ఈ మ్యాచ్‌తో ఇండియాలో న్యూజిలాండ్ టూర్ ముగుస్తుంది.
ఆస్ట్రేలియాతో సిరీస్ షెడ్యూల్ ఇదే
న్యూజిలాండ్ వెళ్లిపోయిన తర్వాత నాలుగు టెస్ట్‌ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా.. ఇండియా రానుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ రెండు టీమ్స్ మధ్య నాలుగు టెస్టులు జరుగుతాయి. తొలి టెస్ట్ ఫిబ్రవరి 9 నుంచి 13 వరకూ నాగ్‌పూర్‌లో జరుగుతుంది. ఆ తర్వాత రెండో టెస్ట్ ఫిబ్రవరి 17 నుంచి 21 వరకూ ఢిల్లీలో ఉంటుంది.
మూడో టెస్ట్ మ్యాచ్ మార్చి 1 నుంచి 5 వరకూ ధర్మశాలలో జరగనుంది. నాలుగో టెస్ట్ అహ్మదాబాద్‌లో మార్చి 9 నుంచి 13 వరకూ జరుగుతుందని బీసీసీఐ వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత తొలిసారి టెస్ట్ సిరీస్ ఆడటానికి ఇండియాకు వస్తుంది ఆస్ట్రేలియా టీమ్. 2017లో చివరిసారి నాలుగు టెస్ట్‌ల సిరీస్ కోసం స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా ఇక్కడికి రాగా.. 1-2తో సిరీస్ కోల్పోయింది.
ఈ గ్యాప్‌లో రెండుసార్లు ఆస్ట్రేలియా వెళ్లిన ఇండియా.. రెండు టెస్ట్ సిరీస్‌లలోనూ విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై వరుసగా రెండు సిరీస్‌లలో ఓడించిన తొలి టీమ్‌గా నిలిచింది. టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత ఇండియా, ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ ఆడతాయి. ఈ మ్యాచ్‌లు మార్చి 17, 19, 22వ తేదీల్లో ముంబై, వైజాగ్, చెన్నైలలో జరుగుతాయి.