తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Smriti Mandhana: హర్మన్, మంధాన బ్యాటింగ్ మెరుపులు - తొలి వన్డేలో టీమ్ ఇండియా ఘన విజయం

Smriti Mandhana: హర్మన్, మంధాన బ్యాటింగ్ మెరుపులు - తొలి వన్డేలో టీమ్ ఇండియా ఘన విజయం

19 September 2022, 11:25 IST

google News
  • Smriti Mandhana: ఆదివారం ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ తో జరిగిన తొలి వన్డేలో ఇండియా ఉమెన్స్ టీమ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. బ్యాటింగ్ లో స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్  ఆకట్టుకున్నారు. 

హర్మన్ ప్రీత్ కౌర్
హర్మన్ ప్రీత్ కౌర్ (twitter)

హర్మన్ ప్రీత్ కౌర్

Smriti Mandhana: ఇంగ్లాండ్ ఉమెన్స్ తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఇండియా ఉమెన్స్ టీమ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో స్మృతి మంధాన 91 రన్స్, హర్మన్ ప్రీత్ కౌర్ 74, యాస్తిక భాటియా 50 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.

టాప్ ఆర్డర్ లో ఎమ్మా లాంబ్, బ్యూమోంట్, డంక్లే తో పాటు క్యాప్సే విఫలం కావడంతో 80 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ టీమ్ కష్టాల్లో పడింది. వ్యాట్ తో కలిసి రిచర్డ్స్ ఇంగ్లాండ్ ను గాడిన పెట్టారు. వ్యాట్ 43 రన్స్ చేసింది. వ్యాట్ ఔట్ అయినా ఎక్లెస్టోన్ 31, డీన్ 24 రన్స్ చేయడంతో ఇంగ్లాండ్ ఈ మాత్రమైనా స్కోరును సాధించింది. రిచర్డ్స్ 50 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.

టీమ్ ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు, గోస్వామి, మేఘన సింగ్, గైక్వాడ్, స్నేహ్ రానా, డియోల్ తలో ఒక్క వికెట్ తీశారు. 228 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ ఇండియా 44 ఓవర్లలోనే 232 పరుగులు చేసి విజయాన్ని అందుకున్నది.

షెఫాలీ వర్మ విఫలమైనా స్మృతి మంధాన, యాస్తిక భాటియా, హర్మన్ ప్రీత్ కౌర్ రాణించడంతో మరో ఆరు ఓవర్లు మిగిలుండగానే టీమ్ ఇండియా గెలిచింది. మూడు వన్డేల హర్మన్ ప్రీత్ సేన సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.

తదుపరి వ్యాసం