IND Vs WI Test Series : వరుణుడిదే గెలుపు.. మ్యాచ్ డ్రా.. 1-0తో సిరీస్ భారత్ కైవసం
25 July 2023, 8:21 IST
- IND vs WI, 2nd Test : ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్ పార్క్ ఓవల్‌లో జరిగిన రెండో టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకుంది.
ఇండియా వర్సెస్ వెస్టిండీస్
ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్ పార్క్ ఓవల్‌లో రెండో టెస్టు వర్షం కారణంగా రద్దు చేశారు. టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనుకున్న భారత్ కు వరుణుడు అడ్డుపడ్డాడు. ఆఖరి రోజు ఆట సాధ్యంకాకుండా డ్రా అయింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకుంది. భారత్ విజయానికి ఎనిమిది వికెట్ల దూరంలో ఉండగా, సిరీస్ సమం చేయడానికి వెస్టిండీస్ 5వ రోజు 289 పరుగులు చేయాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ, భారీ వర్షం కారణంగా ఏదీ జరగలేదు.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను 255 పరుగులకు ఆలౌట్ చేసిన టీమ్ ఇండియా 183 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌ను 181 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన భారత్ వెస్టిండీస్ ముందు 365 పరుగుల టార్గెట్‌ను పెట్టింది. రోహిత్ శర్మ 44 బాల్స్‌లో ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతో 57 రన్స్ చేయగా ఇషాన్ కిషన్ 34 బాల్స్‌లో ఐదు ఫోర్లు 2 సిక్సర్లతో 52 రన్స్ చేశాడు. యశస్వి జైస్వాల్ 30 బాల్స్‌లో 38 రన్స్ చేశాడు. శుభ్ మన్ గిల్ 29 పరుగులతో నిలిచాడు
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 255 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి వెస్టిండీస్ రెండు వికెట్లు కోల్పోయియింది. ఈ రెండు వికెట్లు అశ్విన్‌కు దక్కాయి. ఆదివారం 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. ఆట చివరికి 76/2తో ముగించింది. విండీస్ జట్టుకు.. ఇంకా 289 పరుగులు కావాల్సి ఉండేది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్ వైట్-28, కిర్క్ మెకంజీ-0 వికెట్లను అశ్విన్ తీసుకున్నాడు. త్యాగ్ నారయణ్ 24 నాటౌట్, జెర్మెన్ బ్లాక్ వుడ్ 20 నాటౌట్ గా నిలిచారు.
నాలుగో రోజు.. వర్షం కారణంగా దాదాపు ఒక సెషన్ ఆటకు నష్టం వాటల్లింది. చివరి రోజు అయినా వరుణుడు దయ చూపిస్తాడనుకుంటే.. వర్షం ఇబ్బంది పెట్టింది. ఆటగాళ్లు గ్రౌండులోకి రాకుండా చేసింది. దీంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించేశారు. ఈ కారణంగా 1-0తో సిరీస్ రోహిత్ సేన సొంతమైంది.
వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది తొమ్మిదో టెస్టు సిరీస్ విజయం, టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా 100 (12.2 ఓవర్లు) పరుగులు చేసిన జట్టుగా ఇండియా రికార్డు సృష్టించింది. ఇలా ఈ సిరీస్ లో ఎన్నో రికార్డులు బద్ధలు అయ్యాయి.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ ఇప్పుడు 16 పాయింట్లు, 66.67 పాయింట్ల శాతం (PCT)తో రెండో స్థానంలో ఉంది. వెస్టిండీస్ 4 పాయింట్లు, 16.67 PCTతో ఐదో స్థానంలో ఉంది. భారత్ వర్సెస్ వెస్టిండీస్ మూడు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ గురువారం మెుదలుకానుంది. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ ఆగస్టు 13న ముగుస్తుంది.