Iga Swiatek: దుమ్మురేపిన స్వియాటెక్.. మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం.. రూ.20కోట్ల ప్రైజ్‍మనీ
10 June 2023, 22:54 IST
- Iga Swiatek: ఫ్రెంచ్ ఓపెన్‍లో ఇగా స్వియాటెక్ మరోసారి విజృంభించింది. మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్‍లో ముచోవాపై గెలిచింది.
ఫ్రెంట్ ఓపెన్ టైటిల్‍తో ఇగా స్వియాటెక్
Iga Swiatek: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‍స్లామ్ టెన్నిస్ టోర్నీలో పోలాండ్ ప్లేయర్ ఇగా స్వియాటెక్ మరోసారి అదరగొట్టింది. మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాను నిలబెట్టుకుంది. శనివారం (జూన్ 10) పారిస్‍లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‍లో టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ 6-2, 5-7, 6-4 తేడాతో చెక్ రిపబ్లిక్ అన్‍సీడెడ్ ప్లేయర్ కరోలినా ముచోవాపై విజయం సాధించింది. గత నాలుగేళ్లలో మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది 22ఏళ్ల స్వియాటెక్. మట్టి కోర్టులో మరోసారి దుమ్మురేపి సత్తాచాటింది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన స్వియాటెక్‍కు 2.3 మిలియన్ యూరోల (సుమారు రూ.20కోట్లు) ప్రైజ్‍మనీ దక్కింది.
2007 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‍ను వరుసగా రెండు సంవత్సరాలు కైవసం చేసుకున్న తొలి మహిళా ప్లేయర్‌గా స్వియాటెక్ రికార్డు సాధించింది.
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‍లో స్వియాటెక్.. ఆరంభంలో ముచోవాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‍లో వరుసగా మూడు గేమ్‍లను సొంతం చేసుకొని 3-0తో నిలిచింది. ఆ తర్వాత రెండు గేమ్‍లను గోల్పోయినా.. ఆఖరికి 6-2తో తొలి సెట్ కైవసం చేసుకుంది.
రెండో సెట్‍లో టాప్ సీడ్ స్వియాటెక్‍కు ముచోవా చెమటలు పట్టించింది. 0-3తో వెనుకబడి ఉన్న తరుణంలో ఒక్కసారి విజృంభించింది. చివరికి 7-5తో సెట్ గెలుచుకుంది. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో సెట్‍కు వెళ్లింది. మూడో సెట్‍లోనూ ముచోవా ఓ దశలో 2-0తో దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇగా స్వియాటెక్ మరోసారి దూకుడు ప్రదర్శించింది. 6-4 తేడాతో సెట్ కైవసం చేసుకొని స్వియాటెక్ ఈ ఫైనల్‍లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‍లో ముచోవా సర్వీస్‍ను స్వియాటెక్ ఏడుసార్లు బ్రేక్ చేసింది.
2020, 2022లోనూ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‍ను స్వియాటెక్ కైవసం చేసుకుంది. 2022లో యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఓపెన్ విజేతగానూ నిలిచింది. ప్రస్తుతం టెన్నిస్ మహిళల సింగిల్స్ ఇగా స్వియాటెక్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకింగ్‍లో ఉంది.
సెర్బియా స్టార్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్, నాలుగో సీడ్ కాస్పెర్ రూడ్ మధ్య ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.