తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2022 Final | హార్దిక్‌ మ్యాజిక్‌.. చేతులెత్తేసిన రాయల్స్‌ బ్యాటర్లు

IPL 2022 Final | హార్దిక్‌ మ్యాజిక్‌.. చేతులెత్తేసిన రాయల్స్‌ బ్యాటర్లు

Hari Prasad S HT Telugu

29 May 2022, 21:56 IST

google News
    • గుజరాత్‌ టైటన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అదరగొట్టాడు. బౌలర్‌గా తన బౌన్సర్లతో బెంబేలెత్తించి.. కెప్టెన్‌గా తన బౌలింగ్ మార్పులతో రాజస్థాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేసి ఆ టీమ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగాడు.
మూడు వికెట్లతో రాయల్స్ పని పట్టిన హార్దిక్ పాండ్యా
మూడు వికెట్లతో రాయల్స్ పని పట్టిన హార్దిక్ పాండ్యా (IPL Twitter)

మూడు వికెట్లతో రాయల్స్ పని పట్టిన హార్దిక్ పాండ్యా

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ ఫైనల్లో గుజరాత్‌ టైటన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా బంతితో చెలరేగాడు. 4 ఓవర్లలో కేవలం 17 రన్స్‌ ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీశాడు. అందులో డేంజరస్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ కూడా ఉన్నాడు. దీంతోపాటు సరైన టైమ్ లో సరైన బౌలింగ్ మార్పులు చేసి రాజస్థాన్‌ రాయల్స్‌ను 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులకే కట్టడి చేయగలిగాడు. అతనికి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ మంచి సహకారం అందించాడు. రషీద్‌ 4 ఓవర్లలో 18 రన్స్‌ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో 39 రన్స్‌ చేసిన బట్లరే టాప్‌ స్కోరర్‌.

టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ తమ ఇన్నింగ్స్‌ను ఆచితూచి మొదలుపెట్టింది. మొదట్లో భారీ షాట్లు ఆడటానికి ఇబ్బంది పడిన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ తర్వాత షమి బౌలింగ్‌లో ఒకటి, యశ్‌ దయాల్ బౌలింగ్‌లో మరొక సిక్స్‌ కొట్టి ఊపు మీద కనిపించాడు. అయితే 22 రన్స్‌ చేసి యశ్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. దీంతో 31 రన్స్‌కు రాయల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయారు.

ఇక అక్కడి నుంచి రాజస్థాన్‌ వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (11) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. క్రీజులో కుదురుకోవడానికే ఇబ్బంది పడిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ 10 బాల్స్‌ ఆడి కేవలం 2 రన్స్‌ చేసి ఔటయ్యాడు. టోర్నీ మొత్తం టాప్‌ ఫామ్‌లో ఉన్న బట్లర్‌ ఓవైపు అడపాదడపా బౌండరీలు బాదినా.. స్కోరుబోర్డు వేగంగా ముందుకు కదల్లేదు.

ఈ ఒత్తిడిలో అతడు పాండ్యా బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్‌ దిశగా ఆడటానికి ప్రయత్నించి వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్‌ 35 బంతుల్లో 39 రన్స్‌ మాత్రమే చేశాడు. కాసేపటికే పాండ్యా బౌలింగ్‌లోనే రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించిన హెట్‌మయర్‌ (11) కూడా అతని బౌలింగ్‌లోనే ఔటై నిరాశపరిచాడు. అశ్విన్ (6) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.

టాపిక్

తదుపరి వ్యాసం