Hardik Pandya: బ్రదర్ పొలార్డ్ ఇంటికి వెళ్లిన హార్దిక్.. ఫొటోలు వైరల్
05 August 2022, 11:21 IST
- Hardik Pandya: వెస్టిండీస్‌తో సిరీస్ కోసం కరీబియన్ దీవులకు వెళ్లిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. తన మాజీ ముంబై ఇండియన్స్ టీమ్‌మేట్ కీరన్ పొలార్డ్‌ను తన ఇంటికి వెళ్లి కలిశాడు.
కీరన్ పొలార్డ్ ఫ్యామిలీతో హార్దిక్ పాండ్యా
గయానా: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ సభ్యులుగా హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు ముంబై టీమ్‌ను హార్దిక్ వీడిన తర్వాత కూడా ఈ ఇద్దరి మధ్య అదే ఫ్రెండ్‌షిప్ కొనసాగుతోంది. తాజాగా కరీబియన్ దీవుల్లో టీ20 సిరీస్ ఆడటానికి వెళ్లిన హార్దిక్.. అక్కడే ఉండే కీరన్ పొలార్డ్ ఇంటికి వెళ్లాడు. అతని ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపిన అతడు.. ఆ ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశాడు.
"కింగ్ ఇంటికి వెళ్లకుండా ఏ కరీబియన్ ట్రిప్ కూడా పూర్తవదు. పోలీ నా ఫేవరెట్, నా బ్యూటిఫుల్ ఫ్యామిలీ, నాకు ఆతిథ్యమిచ్చినందుకు నా సోదరుడికి కృతజ్ఞతలు" అని ఈ ఫొటోలను షేర్ చేస్తూ హార్దిక్ రాశాడు. వెస్టిండీస్‌లో ఇండియా వన్డే, టీ20 సిరీస్ కోసం పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్‌ను 3-0తో గెలిచిన ఇండియన్ టీమ్.. టీ20 సిరీస్‌లో ప్రస్తుతం 2-1 లీడ్‌లో ఉంది.
ఇక చివరి రెండు టీ20ల కోసం రెండు టీమ్స్ ఇప్పటికే అమెరికా చేరుకున్నాయి. అక్కడి ఫ్లోరిడా రాష్ట్రంలో శని, ఆదివారాల్లో చివరి రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్కడికి వెళ్లే ముందు హార్దిక్ పాండ్యా.. తన ఫ్రెండ్ అయిన పొలార్డ్ ఇంటికి వెళ్లాడు. వాళ్లతో కలిసి లంచ్ చేశాడు. పొలార్డ్‌తోపాటు అతని భార్యాపిల్లలతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. వన్డే సిరీస్ ఆడని పాండ్యా.. టీ20 సిరీస్ కోసమే అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే.
కరీబియన్ దీవులకు వెళ్లిన వెంటనే విండీస్ లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారాను కూడా హార్దిక్ కలిసిన విషయం తెలిసిందే. లారాతో దిగిన ఫొటోను కూడా ఇంతకుముందు హార్దిక్ ట్విటర్‌లో షేర్ చేశాడు.