Hardik Pandya Test Cricket Re Entry: టెస్టుల్లో రీ ఎంట్రీపై హార్దిక్ పాండ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
04 February 2023, 8:38 IST
Hardik Pandya Test Cricket Re Entry: టెస్ట్ క్రికెట్‌లో రీఎంట్రీపై టీమ్ ఇండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆసక్తికర కామెంట్స్ చేశాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ ముందు అతడు చేసిన ఈ కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
హార్దిక్ పాండ్య
Hardik Pandya Test Cricket Re Entry: టీమ్ ఇండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు హార్దిక్ పాండ్య. వన్డేల్లో కీలక ప్లేయర్‌గా కొనసాగుతోన్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణిస్తూ జట్టుకు ఉపయుక్తమైన ఆటగాడిగా మారిపోయాడు. గాయాల కారణంగా టెస్ట్ క్రికెక్‌కు దూరమైన పాండ్య వన్డేలు, టీ20లలో మాత్రమే కొనసాగుతున్నాడు.
2017లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా పాండ్య టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 11 టెస్ట్‌లు ఆడాడు. 2018లో ఇంగ్లాండ్‌తో చివరి టెస్ట్ ఆడాడు పాండ్య. టెస్టుల్లో రీఎంట్రీపై పాండ్య ఇటీవల ఆసక్తికర కామెంట్స్ చేశాడు. టెస్టుల్లోకి తప్పకుండా రీఎంట్రీ ఇస్తానని తెలిపాడు. అయితే అది ఎప్పుడన్నది మాత్రం వెల్లడించలేదు.
ప్రస్తుతం తన దృష్టి మొత్తం వైట్ బాల్ క్రికెట్‌పైనే ఉందని పాండ్య తెలిపాడు. వన్డేలు, టీ20లకే ప్రాధాన్యతనివ్వాలని నిశ్చయించుకున్నట్లు తెలిపాడు. సరైన టైమ్ కుదరడంతో పాటు ఫిజికల్ ఫిట్‌నెస్ సహకరిస్తే తప్పకుండా టెస్టుల్లో రీ ఎంట్రీ ఇస్తానని పాండ్య పేర్కొన్నాడు.
బోర్డర్ గవాస్కర్ సిరీస్ ముందు హార్డిక్ పాండ్య టెస్ట్ క్రికెట్ రీఎంట్రీపై చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడమే కాకుండా 30 రన్స్ చేసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు పాండ్య.