Gambhir on AB De Villiers: డివిలియర్స్ వ్యక్తిగత రికార్డులు కోసం ఆడాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్
05 March 2023, 15:35 IST
- Gambhir on AB De Villiers: సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌పై టీమిండియా స్టార్ గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చిన్నస్వామి లాంటి చిన్న మైదానంలో ఎక్కువ కాలం ఆడితే ఎవరికైనా మంచి స్ట్రైక్ రేటు ఉంటుందని డివిలియర్స్ గురించి కామెంట్ చేశాడు. అంతేకాకుండా అతడు వ్యక్తిగత రికార్డుల కోసం ఆడాడని తెలిపాడు.
గౌతమ్ గంభీర్
Gambhir on AB De Villiers: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ నైపుణ్యం, ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌతాఫ్రికా దేశానికి చెందిన ఆటగాడే అయినప్పటికీ ఐపీఎల్ ద్వారా మన దేశంలోనూ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు ఈ స్టార్. ముఖ్యంగా 360 డిగ్రీల ఆటతీరుతో బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తూ పరుగుల వర్షాన్ని కురిపిస్తాడు. అలాంటి డివిలియర్స్ పర్సనల్ రికార్డ్స్ కోసం ఆడాడా? అంటే అతడి అభిమానులకు చిర్రెత్తుకురావాల్సిందే. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాత్రం డివిలియర్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా అతడు పర్సనల్ రికార్డుల కోసమే ఆడాడవి స్పష్టం చేశాడు.
"బెంగళూరు చిన్నస్వామి స్టేడియం లాంటి చిన్న మైదానంలో 8 నుంచి 10 ఏళ్ల పాటు ఏబీ డివిలియర్స్ ఆడాడు. అలాంటప్పుడు ఏ ఆటగాడైనా ఒకే స్ట్రైక్ రేట్ లేదా సామర్థ్యం ఉండవచ్చు. కాబట్టి ఇదే సమయంలో సురేష్ రైనా 4 ఐపీఎల్ టైటిల్స్ సొంతం చేసుకున్న జట్టులో భాగమయ్యాడు. దురదృష్టవశాత్తూ ఏబీ డివిలియర్స్ పర్సనల్ రికార్డులు మాత్రమే కలిగి ఉన్నాడు." అని గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
డివిలియర్స్‌పై గంబీర్ ఇలాంటి కామెంట్లు చేయడంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గంభీర్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌తో విరుచుకుపడుతున్నారు. చిన్నస్వామి స్టేడియంలో గంభీర్ గణాంకాలు ఎత్తి చూపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. డివిలియర్స్-గంభీర్ ఇద్దరి గణాంకాలను ఒకరితో ఒకరిని పోల్చుతున్నారు. గంభీర్ చిన్న స్వామి స్టేడియం వేదికగా 11 ఇన్నింగ్స్‌లో 30 సగటుతో 126.4 స్ట్రైక్ రేటుతో మాత్రమే బ్యాటింగ్ చేశాడని, ఏబీ డివిలియర్స్ 61 ఇన్నింగ్స్‌లో 161.2 స్ట్రైక్ రేటుతో 43.56 సగటుతో ఆడాడని స్పష్టం చేశారు. అంత సులభమైతే చిన్నస్వామి స్టేడియంలో మీరెందుకు రికార్డులు సృష్టించలేకపోయారంటూ గంభీర్‌ను ప్రశ్నిస్తున్నారు.
ఏబీ డివిలియర్స్ 2008 నుంచి 2010 వరకు దిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వచ్చి అప్పటి నుంచి 2021 వరకు ఆ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 158.33 స్ట్రైక్ రేటుతో 4522 పరుగులతో ఆర్సీబీ తరఫున రెండో అత్యుత్తమ స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇందులో 2 సెంచరీలు 37 అర్ధశతకాలు ఉన్నాయి. మరో వైపు గౌతమ్ గంభీర్ 2008 నుంచి 2010 వరకు దిల్లీ తరఫున ఆడగా.. 2011లో కోల్‌కతా నైట్ రైడర్స్ గూటికి చేరాడు. ఆ జట్టు కెప్టెన్‌గా 2012, 2014లో ఐపీఎల్ విజేతగా నిలిపాడు. తన కెరీర్‌లో 154 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 4218 పరుగులు చేశాడు. ఇందులో 36 అర్ధశతకాలు ఉన్నాయి.
టాపిక్