Gambhir Hails MS Dhoni: ధోనీపై గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం.. ఆ విషయంలో ధోనీ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు
11 November 2022, 19:22 IST
- Gambhir Hails MS Dhoni: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. ఎంఎస్ ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఘనత ధోనీకి మాత్రమే సొంతమని.. మరో భారత కెప్టెన్ సాధ్యం కాదని అతడు జోస్యం చెప్పాడు.
ఎంఎస్ ధోనీ
Gambhir Hails MS Dhoni: ఐసీసీ టోర్నీల్లో టీమిండియా వరుస వైఫల్యం కొనసాగుతూనే ఉంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన తర్వాత టీమిండియా ఇంతవరకు ఒక్క టోర్నీలోనూ పైచేయి సాధించలేదు. తాజాగా 2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలై అప్రతిష్ఠ మూటగట్టుకుంది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు టీమిండియాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎన్ని రికార్డులు బ్రేక్ అయినా.. మహేంద్ర సింగ్ ధోనీ గెలిచిన మూడు ఐసీసీ ట్రోఫీల ఘనత మరో భారత కెప్టెన్ ఎవరూ బ్రేక్ చేయలేరని గంభీర్ స్పష్టం చేశాడు.
"రోహిత్ శర్మ కంటే ఎక్కువగా ఇంకెవరైనా డబుల్ సెంచరీలు చేయవచ్చు.. విరాట్ కోహ్లీ కంటే అధికంగా శతకాలూ నమోదు చేయవచ్చు. కానీ మహేంద్ర సింగ్ ధోనీ మాదిరిగా మరే ఇండియన్ కెప్టెన్ మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుస్తారని నేను అనుకోవడం లేదు." అని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు.
ధోనీ కాకుండా ఐసీసీ ట్రోఫీ గెలిచిన కెప్టెన్ కపిల్ దేవ్ ఒక్కడే. ఆయన 1983 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అనంతరం 2007లో ధోనీ సారథ్యంలో భారత్ టీ20 వరల్డ్ కప్‌ను గెలిచింది. ఆ తర్వాత 2011లో అతడి కెప్టెన్సీలోనే వన్డే ప్రపంచకప్‌ను, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. ఈ విధంగా చూసుకుంటే అత్యంత విజయవంతమైన టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వ్యవహరించారు.
గురువారం నాడు ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ.. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య అర్ధశతకాలతో జట్టును ఆదుకున్నారు. అనంతరం ఇంగ్లాండ్ 16 ఓవర్లలోనే వికెట్లేమి కోల్పోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇంగ్లీష్ ఓపెనర్లు జాస్ బట్లర్(80), అలెక్స్ హేల్స్(86) అద్భుత అర్దశతకాలతో విజృంభించి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ 170 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.