England vs Pakistan 3rd Test: పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ చారిత్రక విజయం.. టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్
20 December 2022, 13:23 IST
- England vs Pakistan 3rd Test: పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ చారిత్రక విజయాన్ని అందుకుంది. మూడు టెస్టుల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా పాక్ గడ్డపై టెస్టు సిరీస్ వైట్ వాష్ చేసిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది.
పాక్ పై విజయానంతరం ఇంగ్లాండ్ జట్టు
England vs Pakistan 3rd Test: ఇటీవలే రెండో సారి టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకుని ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన ఇంగ్లాండ్.. జట్టు నెల రోజుల వ్యవధిలోనే మరో అరుదైన ఘనత సాధించింది. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి చారిత్రక విజయాన్ని దక్కించుకుంది. పాక్ గడ్డపై ఆ దేశాన్ని ఈ విధంగా వైట్ వాష్ చేసి ఓడించడం ఏ జట్టుకైనా ఇదే మొదటి సారి. చివరిదైన మూడో టెస్టును 8 వికెట్ల తేడాతో గెలిచింది ఇంగ్లీష్ జట్టు. 167 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ఓవర్‌నైట్ స్కోరు 112/2తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్.. 167 పరుగుల లక్ష్యాన్ని కేవలం 38 నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేసింది. బెన్ డకెట్(82) అద్భుత అర్ధశతకానికి తోడు బెన్ స్టోక్స్(35) రాణించడంతో విజయం ఖరారైంది. రావల్పిండి వేదికగా జరిగిన మొదటి టెస్టును ఇంగ్లాండ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించగా.. ముల్తాన్ వేదికగా సాగిన రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో గెలిచింది. 2005 తర్వాత పాకిస్థాన్‍లో మొదటిసారిగా పర్యటించిన ఇంగ్లాండ్‌కు ఆ జట్టుపై ఇదే మొదటి టెస్టు పర్యటన.
మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 304 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజం(78), అగా సల్మాన్(56) అర్ధ సెంచరీలు చేయడంతో మెరుగైన స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ 354 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బుక్(111) సెంచరీతో కదం తొక్కగా.. ఓలీ పోప్(51), ఫోక్స్(64) అర్ధ సెంచరీలు చేయడంతో 50 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు చేతులెత్తేశారు. ఫలితంగా పాక్ 216 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్ రెహన్ అహ్మద్ 5 వికెట్లతో రాణించాడు.
కరాచీ వేదికగా జరిగిన ఈ టెస్టుతో ఇంగ్లాండ్ అరుదైన ఘనతను సాధించింది. నేషనల్ స్టేడియంలో 45 టెస్టులాడిన పాకిస్థాన్‌కు గత 15 ఏళ్లలో ఇది మూడో ఓటమి. ఏడేళ్లలో దక్షిణాఫ్రికా తర్వాత అక్కడ పాకిస్థాన్‌ను ఓడించిన మొదటి జట్టు ఇంగ్లాండ్. 2000లో ఇదే వేదికపై ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది.