ENG vs NZ Test: పదిహేనేళ్ల తర్వాత న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లాండ్ తొలి విక్టరీ
19 February 2023, 10:43 IST
ENG vs NZ Test: న్యూజిలాండ్‌తో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్‌లో ఇంగ్లాండ్ 267 పరుగుల భారీ ఆధిక్యంతో విజయాన్ని అందుకున్నది. నాలుగు రోజుల్లోనే ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసింది.
ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్
ENG vs NZ Test: ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ వన్డేను తలపిస్తూ సాగింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ధనాధన్ ఇన్నింగ్స్‌లతో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసింది. న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ 267 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకున్నది. 2008 తర్వాత న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లాండ్ తొలి విజయాన్ని అందుకొని చరిత్రను సృష్టించింది.
కోచ్‌గా మెక్ కలమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ ఎంపికైన తర్వాత గత పదకొండు టెస్ట్ మ్యాచుల్లో ఇంగ్లాండ్‌కు ఇది పదో గెలుపు కావడం గమనార్హం. ఇంగ్లాండ్ విధించిన 394 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన న్యూజిలాండ్ 126 పరుగులకే ఆలౌటైంది. పేసర్లు స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ తలో నాలుగు వికెట్లతో విజృంభించడంలో న్యూజిలాండ్ వంద పరుగుల్ని కష్టంగా దాటింది.
ఈ టెస్ట్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325, రెండో ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 306 పరుగులు చేసిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 126 పరుగులకే ఆలౌట్ అయ్యి దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నది.