తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Team India Sponsor: టీమిండియాకు నయా స్పాన్సర్.. ఇక ఆ లోగో జెర్సీలతో బరిలోకి ప్లేయర్లు

Team India Sponsor: టీమిండియాకు నయా స్పాన్సర్.. ఇక ఆ లోగో జెర్సీలతో బరిలోకి ప్లేయర్లు

01 July 2023, 17:05 IST

google News
    • Indian Cricket Team Sponsor: టీమిండియా స్పాన్సర్‌గా డ్రీమ్ 11 ఎంపికైంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (ICC Twitter)

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

Indian Cricket Team Sponsor: భారత క్రికెట్ జట్టుకు కొత్త స్పాన్సర్ వచ్చింది. ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ఫ్లాట్‍ఫామ్ ‘డ్రీమ్ 11’.. టీమిండియాకు లీడ్ స్పాన్సర్‌గా ఉండనుంది. ఈ విషయాన్ని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (BCCI) నేడు అధికారికంగా ప్రకటించింది. దీంతో లీడ్ స్పాన్సర్‌గా ఎడ్ టెక్ కంపెనీ బైజూస్ స్థానాన్ని డ్రీమ్ 11 భర్తీ చేయనుంది. మరోసారి భారత జట్టుకు డ్రీమ్ 11 ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. మూడేళ్లకు ఈ స్పాన్సర్‌షిప్‍ను డ్రీమ్ 11 దక్కించుకుంది. అయితే, ఈ ఒప్పందం విలువను బీసీసీఐ పేర్కొనలేదు. వివరాలివే..

డ్రీమ్ 11 స్పాన్సర్‌గా ఎంపికవటంతో ఇక టీమిండియా జెర్సీలపై ఆ కంపెనీ లోగో ఉండనుంది. అంటే డ్రీమ్ 11 లోగో ఉండే జెర్సీలతో భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. జూలై 12న మొదలయ్యే వెస్టిండీస్ పర్యనటనతో ఇది షురూ కానుంది. వెస్టిండీస్‍లో ఆ జట్టుతో జూలై 12 నుంచి తొలి టెస్టు ఆడనుంది టీమిండియా. ఈ మ్యాచ్ నుంచి డ్రీమ్ 11 జెర్సీలను ప్లేయర్లు ధరించనున్నారు.

“డ్రీమ్ 11ను అభినందిస్తున్నాం. అలాగే బోర్డులోకి మళ్లీ ఆహ్వానం పలుకుతున్నాం. బీసీసీఐకు ఇప్పటికే అఫీషియల్ స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11 ఇప్పుడు లీడ్ స్పాన్సర్‌గా మారింది. బీసీసీఐ - డ్రీమ్ 11 బంధం మరింత బలపడింది” అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ప్రకటించారు.

వెస్టిండీస్‍లో టీమిండియా పర్యటన జూలై 12న ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‍లు జరగనున్నాయి. వెస్టిండీస్‍తో తొలి టెస్టుతోనే 2023-25 టెస్టు చాంపియన్‍షిప్ సైకిల్‍ను టీమిండియా మొదలుపెట్టనుంది. ఈ టూర్ నుంచే డ్రీమ్ 11 లోగో ఉండే జెర్సీలను ధరించనున్నారు భారత ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్.

“బీసీసీఐ, టీమిండియాతో మా భాగస్వామ్యాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళుతుండడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. డ్రీమ్ 11తో కోట్లాది మంది భారతీయులతో క్రికెట్‍పై ప్రేమను షేర్ చేసుకుంటున్నాం. జాతీయ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా ఉండడం గర్వంగా భావిస్తున్నాం” అని డ్రీమ్ 11 పేర్కొంది.

తదుపరి వ్యాసం