MS Dhoni Viral | ధోనీ ఫీల్డింగ్ సెట్ చేశాడు.. కోహ్లీ దొరికి పోయాడు
13 April 2022, 13:58 IST
- మంగళవారం బెంగళూరతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ సెట్ చేసిన ధోనీ.. విరాట్ వికెట్ తీయడంలో కీలక పాత్ర పోషించాడు. చివరాఖరులో తన వ్యూహంతో విరాట్‌ను పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్ని సార్లు గుర్తు చేసుకున్నా మరువలేం. అంతగా మైదానంలో ప్రతి ఆటగాడి కదలికను చక్కగా అంచనా వేస్తూ వారిని బుట్టలో వేస్తుంటాడు. అంతేకాకుండా ప్రత్యర్థి వ్యూహాలను ముందుగానే ఊహించి వారి గట్టిగా దెబ్బకొడుతుంటాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా వైదొలిగి రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలను అప్పజెప్పినప్పటికీ చాలా సార్లు క్లిష్ట పరిస్థితుల్లో జడ్డూకు బదులు ధోనీ ఫీల్డింగ్ సెట్ చేశాడు. మంగళవారం బెంగళూరతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే విధంగా ఫీల్డింగ్ సెట్ చేసి విరాట్ వికెట్ తీయడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీఎస్‌కే పేసర్ ముకేశ్ చౌదురీ 5వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. అయితే ధోనీ అప్పటికే ఉన్న ఫీల్డింగ్‌లో కొన్ని మార్పులు చేశాడు. తనకు ఎడమ వైపున ఉన్న డీప్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్‌కు దగ్గరగా ఉండే ఫైన్ లెగ్ ఫీల్డర్‌ను మార్చాడు. అనంతరం ముకేశ్ వేసిన మొదటి బంతిని కోహ్లీ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా కొట్టాడు. దీంతో అక్కడ ఉన్న శివమ్ దూబే చేతులోకి కోహ్లీ కొట్టిన బంతి వచ్చి చేరింది. దీంతో విరాట్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ధోనీ ఫీల్డిగ్ సెట్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహీ ఈ విధంగా ఫీల్డింగ్ సెట్ చేసి తనకు అనుగుణంగా ఫలితాలను తీసుకురావడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ పలుమార్లు ఈ విధంగా తన తెలివితో అద్భుత ఫలితాలను రాబట్టాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టపోయి 216 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శివమ్ దూబే(95), రాబిన్ ఊతప్ప(88) విశ్వరూపమే చూపించారు. వరుస సిక్సర్లతో చెలరేగి ఆడటంతో బెంగళూరు బౌలర్లు చేతులెత్తేశారు. ఒకానొక స్థితిలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలో కూడా అర్థం కాని స్థితిలో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ అనుకున్నాడంటే.. ఊచకోత ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 9 వికెట్లు నష్టపోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివర్లో షాబాజ్ అహ్మద్, సుయాశ్ ప్రభు దేశాయ్, దినేశ్ కార్తీక్ ధాటిగా ఆడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో చెన్నై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్లలో మహీశ్ తీక్షణ 4 వికెట్లతో విజృంభించగా.. కెప్టెన్ జడేజా మూడు వికెట్లు తీశాడు.
టాపిక్