CWG 2022 Day 7 Live Updates: సెమీస్‌కు చేరిన భారత హాకీ జట్టు..వేల్స్‌పై విజయం
04 August 2022, 22:23 IST
- CWG 2022 Day 7 Live Updates: కామన్వెల్త్ గేమ్స్‌లో ఏడో రోజు బాక్సర్ అమిత్ పంగాల్ మరో మెడల్ ఖాయం చేశాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ లు తమ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లలో సులువుగా గెలిచారు. అటు 200 మీటర్ల పరుగులో హిమ దాస్ సెమీఫైనల్ చేరింది.
టేబుల్ టెన్నిస్ ప్రీ క్వార్టర్‌లో శరత్-శ్రీజ జోడీ
టేబుల్ టెన్నిస్ భారత మిక్స్‌డ్ జోడీ దూసుకెళ్తోంది. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా జరిగిన 32వ రౌండులో వీరు నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన సోఫీ ఎర్లీ, ఓవెన్ క్యాథ్‌కార్ట్‌పై 11-7, 11-9 తేడాతో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు చేరారు.
స్క్వాష్ ప్రీ క్వార్టర్స్‌లో మనిక- జ్ఞానశేఖరన్
కామన్వెల్త్ గేమ్స్‌లో స్క్వాష్ క్రీడాకారులు అదరగొడుతున్నారు. తాజాగా మనికా బాత్రా-సత్యన్ జ్ఞానశేఖర్ జోడీ ప్రీ క్వార్టర్స్‌తు చేరింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగం ఈ జోడీ.. సిషెల్స్‌కు చెంది మిక్ క్రియా, లారా సినన్‌ను 11-1, 11-3. 11-1 తేడాతో విజయం సాధించింది.
కామన్వెల్త్ సెమీస్ లో భారత హాకీ జట్టు
కామన్వెల్త్ గేమ్స్ ఏడో రోజు భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసిన సెమీస్‌కు దూసుకెళ్లింది. వేల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 4-1 తేడాతో విజయం సాధించింది.
సెమీ ఫైనల్స్ దిశగా భారత హాకీ జట్టు
భారత పురుషుల హాకీ జట్టు సెమీస్ దిశగా దూసుకెళ్తోంది. వేల్స్‌తో జరుగుతున్న క్వార్టర్స్‌లో పూర్తి ఆధిక్యం సాధించింది. ఇప్పటి వరకు 4-0 గోల్స్ తేడాతో ముందంజలో ఉంది. ఇదే కొనసాగితే సెమీస్‌కు దూసుకెళ్లడం ఖాయంలా అనిపిస్తుంది.
స్క్వాష్ క్వార్టర్స్‌లో దీపిక-సౌరవ్
కామన్వెల్త్ గేమ్స్‌లో స్క్వాష్ మిక్స్‌డ్ ద్వయం దీపికా పల్లికల్-సౌరవ్ ఘోషల్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. వేల్స్ కు చెందిన ఎమిలీ వైట్‌లాక్, పీటర్ క్రీడ్ ద్వయంపై 11-8, 11-4 తేడాతో సునాయస విజయాన్ని సాధించారు.
బాక్సింగ్‌లో పతకం ఖాయం చేసిన జాస్మిన్
భారత బాక్సర్ జాస్మిన్ లంబోరియా మహిళల 60 కేజీల విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌కు చెందిన ట్రాయ్ గార్టన్‌పై విజయం సాధించింది. తొలుత వెనుకంజ వేసిన భారత బాక్సర్.. అనంతరం పుంజుకుని ప్రత్యర్థిపై పైచేయి సాధించింది.
స్క్వాష్‌లో భారత మహిళల జట్టు విజయం
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్క్వాష్ మహిళల జట్టు ముందంజ వేసింది. శ్రీలంకకు చెందిన యెహిని కురుపు- చానిత్మ సినాలేపై భారత అమ్మాయిలు సునన్య కురువిల్లా- అనహత్ సింగ్ విజయం సాధించారు.
CWG 2022 Day 7 Live Updates: బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ నుంచి అశ్విని, సుమిత్ ఔట్
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్ రౌండ్ ఆఫ్ 32లోనే ఇంటిదారి పట్టారు ఇండియన్ షట్లర్లు అశ్విని పొన్నప్ప, సుమీత్ రెడ్డి. వీళ్లు ఇంగ్లండ్‌కు చెందిన ఆరో సీడ్ జోడీ జెస్సికా పగ్, కాలమ్ పగ్ చేతుల్లో 18-21, 16-21 తేడాతో ఓడిపోయారు.
CWG 2022 Day 7 Live Updates: బాక్సింగ్‌లో మెడల్ ఖాయం చేసిన అమిత్ పంగాల్
కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్‌లో మరో మెడల్ ఖాయం చేశాడు స్టార్ బాక్సర్ అమిత్ పంగాల్. క్వార్టర్‌ఫైనల్లో అతడు 4-1 తేడాతో ప్రత్యర్థి ముల్లిగాన్‌పై గెలిచాడు. రెండు రౌండ్లలోనూ అతడు 4-1 తేడాతో అమిత్ విజయం సాధించాడు. సెమీస్ చేరడంతో అమిత్‌కు కనీసం బ్రాంజ్ మెడల్ కచ్చితంగా రానుంది.
CWG 2022 Day 7 Live Updates: హ్యామర్ త్రో ఫైనల్ చేరిన మంజు బాలా
కామన్వెల్త్ గేమ్స్‌లో హ్యామర్ త్రో ఫైనల్ చేరింది ఇండియన్ అథ్లెట్ మంజు బాలా. ఆమె హ్యామర్‌ను 59.68 మీటర్ల దూరం విసిరింది. మరో అథ్లెట్ సరితా సింగ్ మాత్రం అర్హత సాధించలేకపోయింది. నిజానికి ఫైనల్‌కు కటాఫ్‌గా 68 మీటర్లు పెట్టినా.. మంజు బాలా మాత్రం టాప్ 12లో నిలవడంతో అర్హత సాధించగలిగింది.
CWG 2022 Day 7 Live Updates: తొలి మ్యాచ్ గెలిచిన శ్రీకాంత్
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సులువుగా గెలిచాడు. అతడు ఉగాండాకు చెందిన డేనియల్ వనగలియాపై 21-9, 21-9 తేడాతో అతడు గెలిచి రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టాడు.
CWG 2022 Day 7 Live Updates: తొలి గేమ్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సునాయాసంగా తొలి గేమ్ గెలిచాడు. అతడు ఉగాండాకు చెందిన డేనియల్ వానగలియాపై 21-8 తేడాతో తొలి గేమ్ సొంతం చేసుకున్నాడు. అతడు ఈ మ్యాచ్ గెలవడం లాంఛనంగానే కనిపిస్తోంది.
CWG 2022 Day 7 Live Updates: సింగిల్స్ తొలి మ్యాచ్ సులువుగా గెలిచిన సింధు
స్టార్ షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో సులువుగా గెలిచింది. మాల్దీవ్స్‌కు చెందిన ఫాతిమాపై ఆమె 21-4, 21-11 తేడాతో సింధు విజయం సాధించింది. ఆమె ప్రస్తుతం ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.
CWG 2022 Day 7 Live Updates: తొలి గేమ్ గెలిచిన పీవీ సింధు
బ్యాడ్మింటన్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో మాల్దీవ్స్‌కు చెందిన ఫాతిమాతో ఆడుతున్న పీవీ సింధు తొలి గేమ్‌ను 21-4తో సునాయాసంగా గెలిచింది.
CWG 2022 Day 7 Live Updates: బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు ఫైట్
స్టార్ షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో తన ఫైట్ ప్రారంభించింది. మాల్దీవ్స్‌కు చెందిన ఫాతిమా అబ్దుల్ రజాక్‌తో జరుగుతున్న మ్యాచ్ తొలి గేమ్‌లో 5-0 లీడ్ తీసుకుంది.
CWG 2022 Day 7 Live Updates: సెమీఫైనల్‌కు హిమ దాస్
కామన్వెల్త్ గేమ్స్ 200 మీటర్ల హీట్స్‌లో స్టార్ రన్నర్ హిమ దాస్ గెలిచింది. ఆమె 23:42 సెకన్లలో రేసు పూర్తి చేసి సెమీఫైనల్‌కు క్వాలిఫై అయింది.
CWG 2022 Day 7 Live Updates: హిమదాస్‌పైనే అందరి కళ్లూ..
కామన్వెల్త్ గేమ్స్ ఏడో రోజు అథ్లెటిక్స్‌లో ఇండియన్ స్టార్ అథ్లెట్ హిమ దాస్‌పైనే అందరి కళ్లూ ఉన్నాయి. ఆమె గురువారం 200 మీ. రేసులో తలపడనుంది. మధ్యాహ్నం 3.03 గంటలకు 200 మీటర్ల రౌండ్ 1 హీట్ 2లో హిమ దాస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
CWG 2022 Day 7 Live Updates: ఇండియాకు ఇంకా గోల్డ్ మెడల్స్ పై ఆశలు రేపుతోంది వీళ్లే
పీవీ సింధు
ఈ హైదరాబాదీ స్టార్ షట్లర్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనే గోల్డ్ మిస్ అయినందుకు బాధపడుతోంది. సింగిల్స్‌లో మాత్రం పక్కాగా గోల్డ్ తీసుకొస్తానని ఇప్పటికే చెప్పింది. రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన పీవీ సింధు చెప్పింది చేస్తుందన్న నమ్మకం ఫ్యాన్స్‌కు ఉంది.
లక్ష్యసేన్
ఇండియన్ బ్యాడ్మింటన్‌లో దూసుకెళ్తున్న ఈ యువ కెరటం బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్‌లో గోల్డ్‌పై ఆశలు రేపుతున్నాడు. ఈ ఏడాది తొలిసారి ఇండియా థామస్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన లక్ష్యసేన్ ఇండియన్ ఓపెన్ కూడా గెలిచాడు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ గెలిచాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ పక్కాగా గెలుస్తాడు.
నిఖత్ జరీన్
ఈ తెలంగాణ బాక్సర్, వరల్డ్ ఛాంపియన్ కచ్చితంగా గోల్డ్ మెడల్ తీసుకొస్తుందని దేశం మొత్తం ఆశతో ఉంది. ఈ మధ్యే వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. టాప్ ఫామ్‌లో ఉంది. ఇప్పటికే సెమీఫైనల్ చేరింది. దీంతో బ్రాంజ్ మెడల్ అయితే ఖాయమైంది. అయితే ఆమె రేంజ్‌కు గోల్డ్ మెడల్ మాత్రమే సూటవుతుందనడంలో డౌట్ లేదు.
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్
తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టిన ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ లీగ్ స్టేజ్‌లో పాకిస్థాన్, బార్బడోస్‌ను చిత్తు చేసి ఇప్పటికే సెమీస్ చేరింది. టీమ్ గోల్డ్ తెస్తుందన్న ఆశ అయితే ఉంది కానీ.. మన టీమ్‌కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లే ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి.
హాకీ మెన్స్ టీమ్
నాలుగు దశాబ్దాల తర్వాత గతేడాది ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఈసారి గోల్డ్‌పై కన్నేసింది. కెనడాను రికార్డు స్థాయిలో 11-0తో చిత్తు చేసి ఇండియన్ టీమ్ ఊపు మీదుంది.
హిమ దాస్
అథ్లెటిక్స్‌లో హిమదాస్‌పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆమె 4x100 రిలే ఈవెంట్‌లో పాల్గొంటోంది. ఆమెతోపాటు ద్యుతీ చంద్, శ్రాబని నందా, ఎంవీ జిల్నా కూడా టీమ్‌లో ఉన్నారు. ఇప్పటి వరకూ కామన్వెల్త్‌లాంటి మెగా టోర్నీలో మెడల్ గెలవని హిమదాస్ ఈసారి గోల్డ్ తీసుకొస్తుందన్న ఆశతో ఉన్నారు.
వీళ్లే కాకుండా రెజ్లింగ్‌లో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ రవికుమార్ దహియా, స్క్వాష్‌లో దీపికా పల్లికల్, అథ్లెటిక్స్ 3000 మీ. స్టీపుల్ చేజ్‌లో అవినాష్ సాబ్లే, టేబుల్ టెన్నిస్‌లో మనికా బాత్రాలు కూడా గోల్డ్ తెస్తారన్న అంచనాలు ఉన్నాయి.
CWG 2022 Day 7 Live Updates: ఇండియా షెడ్యూల్ ఇదీ
అథ్లెటిక్స్
మధ్యాహ్నం 2.30 - వుమెన్స్ హ్యామర్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్ - సరితా సింగ్, మంజు బాలా
మధ్యాహ్నం 3.03 - వుమెన్స్ 200 మీ. రౌండ్ 1 హీట్ 2 - హిమ దాస్
అర్ధరాత్రి 12.12 - మెన్స్ లాంగ్ జంప్ ఫైనల్స్ - మురళీ శ్రీశంకర్, ముహ్మద్ అనీస్ యాహియా
బాక్సింగ్ - అన్నీ క్వార్టర్‌ఫైనల్సే, గెలిస్తే మెడల్ పక్కా
సాయంత్రం 4.45 - అమిత్ పంగాల్ (48-51 కేజీల క్వార్టర్‌ఫైనల్)
సాయంత్రం 6.15 - జాస్మైన్ లాంబోరియా (67-70 కేజీలు క్వార్టర్‌ఫైనల్)
రాత్రి 8 - సాగల్ అహ్లావత్ (ఓవర్ 92 కేజీ క్వార్టర్‌ఫైనల్స్)
అర్ధరాత్రి 12.30 - రోహిత్ టోకాస్ (63.5-67 కేజీ క్వార్టర్‌ఫైనల్స్)
రిథమిక్ జిమ్నాస్టిక్స్
సాయంత్రం 4.30 - బల్వీన్ కౌర్ - వ్యక్తిగత క్వాలిఫికేషన్ సబ్-డివిజన్ 1
మెన్స్ హాకీ
సాయంత్రం 6.30 - ఇండియా vs వేల్స్
లాన్ బౌల్స్
సాయంత్రం 4 - మృదుల్ బోర్గొహైన్ (మెన్స్ సింగిల్స్)
స్క్వాష్
సాయంత్రం 5.30 - సునాయా సారా కురువిల్లా/అనాహత్ సింగ్ (వుమెన్స్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 32)
సాయంత్రం 6 - సెంథిల్‌కుమార్ వాలావన్/అభయ్ సింగ్ (మెన్స్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 32)
సాయంత్రం 7 - దీపికా పల్లికల్/సౌరవ్ ఘోషల్ (మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16)
రాత్రి 11 - జోష్న చిన్నప్ప/హర్పిందర్ పాల్ సింగ్ సంధు (మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16)
అర్ధరాత్రి 12.30 - జోష్న చిన్నప్ప/దీపికా పల్లికల్ (వుమెన్స్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16)
టేబుల్ టెన్నిస్ (రాత్రి 8.30 నుంచి)
సనీల్ శెట్టి/రీత్ టెన్నిసన్ - మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 64
సత్యన్ జ్ఞానశేఖరన్/మనికా బాత్రా - మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 32
ఆచంట శరత్ కమల్/శ్రీజా ఆకుల - మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 32
రీత్ టెన్నిసన్, శ్రీజా ఆకుల, మనికా బాత్రా - వుమెన్స్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32
హర్మీత్ దేశాయ్/సనీల్ శెట్టి, శరత్ కమల్/సత్యన్ జ్ఞానశేఖరన్ - మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 32