Chess World Cup 2023 : చెస్ వరల్డ్ కప్.. వాట్ ఏ పర్ఫామెన్స్.. ఫైనల్లోకి ప్రజ్ఞానంద
24 August 2023, 13:04 IST
- Chess World Cup 2023 : ఫిడే చెస్ ప్రపంచ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించాడు ప్రజ్ఞానంద. ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరునాను ఓడించి.. ఈ రికార్డు సృష్టించాడు.
ప్రజ్ఞానంద
అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన చెస్ ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద ఫైనల్లోకి ప్రవేశించాడు. దీంతో చెస్ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన 2వ భారతీయుడిగా నిలిచాడు. ఇంతకు ముందు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఈ ఘనత సాధించాడు.
ఆదివారం జరిగిన సెమీఫైనల్ తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద, అమెరికాకు చెందిన ఫాబియానో కరువానాతో డ్రా చేసుకున్నాడు. ఫాబియానో కరువానా 2వ గేమ్‌ను డ్రా చేసుకోగలిగాడు. అందువల్ల ఫలితాన్ని నిర్ణయించడానికి టైబ్రేకర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది.
అందుకు తగ్గట్టుగానే సోమవారం జరిగిన టైబ్రేకర్ గేమ్‌లో ప్రపంచ నంబర్ 3 చెస్ ప్లేయర్ ఫాబియానో కరువానా ప్రజ్ఞానందపై ఒత్తిడి తెచ్చి సఫలమయ్యాడు. కానీ 18 ఏళ్ల భారత చెస్ నిర్ణయాత్మక ఎత్తుగడల్లో పట్టు సాధించి గేమ్‌ను డ్రాగా తీసుకెళ్లగలిగాడు.
2వ టైబ్రేకర్ గేమ్‌లోనూ ప్రజ్ఞానంద ఫాబియానో కరువానాను గెలవకుండా అడ్డుకున్నాడు. దీంతో మ్యాచ్ 10+10 టైబ్రేక్‌కు వెళ్లింది. దీని తర్వాత, ప్రజ్ఞానంద మొదటి ర్యాపిడ్ టైబ్రేక్‌ను గెలుచుకోవడం ద్వారా ఫాబియానోపై ఒత్తిడి తెచ్చాడు. చివరకు ప్రజ్ఞానంద 3.5-2.5తో ఫాబియానో కరువానాపై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 1 చెస్ స్టార్ మాగ్నస్ కార్ల్‌సెన్‌తో ప్రజ్ఞానంద పోటీపడనున్నాడు. యువ చెస్ మేధావి ప్రజ్ఞానంద ఇందులో విజయం సాధించి కొత్త చరిత్ర సృష్టిస్తాడో లేదో చూడాలి.
క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించిన మొదటి భారతీయ చెస్ క్రీడాకారుడు 18 ఏళ్ల ప్రజ్ఞానంద. ఇప్పుడు ఫైనల్స్‌లోకి ప్రవేశించి హీరోగా మారాడు. దీని ద్వారా గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన 2వ భారతీయుడిగా తమిళనాడుకు చెందిన రమేష్ బాబు ప్రజ్ఞానంద రికార్డు సృష్టించాడు.
'ఈ టోర్నీలో మాగ్నస్‌తో తలపడతానని ఊహించలేదు. ఎందుకంటే వారితో నేను ఆడగల ఏకైక మార్గం ఫైనల్స్‌లోనే. నేను ఫైనల్‌కు వస్తానని కూడా ఊహించలేదు. సెమీ-ఫైనల్‌లో నా డిఫెన్సివ్ ఆటతో గెలిచానని అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని ఆటలు చాలా కష్టంగా ఉండేవి. కానీ ఒక దశలో ఫాబియానో తడబడ్డాడు. చివరకు విజయం సాధించగలిగాను. ఇప్పుడు ఫైనల్‌కు చేరుకున్నాను.' అని ప్రజ్ఞానంద తెలిపాడు.
ప్రజ్ఞానంద ఫైనల్స్ కు వెళ్లడంపై దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ స్పందించాడు. ఫాబియానో కరునాను ఓడించి ప్రజ్ఞానంద పైనల్స్ వెళ్లాడని, మాగ్నస్ కార్ల్ సన్ తో పోటీపడనున్నాడని పేర్కొన్నాడు. వాటే పర్ఫామెన్స్ అని ట్వీట్ చేశాడు.