Chess World Cup 2023 Final: ప్రజ్ఞానంద కింగ్ అవుతాడా.. చెస్ వరల్డ్ కప్ టైబ్రేకర్ ఎప్పుడు ఎక్కడ చూడాలి?
24 August 2023, 13:03 IST
- Chess World Cup 2023 Final: ప్రజ్ఞానంద కింగ్ అవుతాడా.. చెస్ వరల్డ్ కప్ టైబ్రేకర్ కు టైమ్ దగ్గర పడింది. వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ తో టైటిల్ కోసం గురువారం (ఆగస్ట్ 24) అసలుసిసలు ఫైట్ జరగనుంది.
చెస్ వరల్డ్ కప్ ఫైనల్ రెండో క్లాసికల్ గేమ్ లో తలపడుతున్న ప్రజ్ఞానంద, మాగ్నస్ కార్ల్‌సన్
Chess World Cup 2023 Final: ఇండియన్ చెస్ సెన్సేషన్ ఆర్ ప్రజ్ఞానంద ఇప్పుడు ప్రపంచ కింగ్ అవుతాడా? గురువారమే (ఆగస్ట్ 24) దీనికి సమాధానం లభించనుంది. చెస్ వరల్డ్ కప్ 2023 ఫైనల్ టై బ్రేకర్ కు టైమ్ దగ్గరపడింది. ఫైనల్లో మంగళవారం (ఆగస్ట్ 22), బుధవారం (ఆగస్ట్ 23) జరిగిన తొలి రెండు గేమ్స్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.
దీంతో టై బ్రేకర్ ద్వారా విజేత ఎవరో తేలనుంది. కార్ల్‌సన్ ను గతంలో ఓసారి ఓడించిన ప్రజ్ఞానంద.. ఫైనల్లోనూ అతనికి గట్టి పోటీ ఇస్తున్నాడు. తొలి రెండు గేమ్స్ డ్రా చేసుకోవడం మాటలు కాదు. ఇప్పుడు టై బ్రేకర్ లో విజయం సాధిస్తే అతడు కొత్త చరిత్రకు నాంది పలుకుతాడు. ఫైనల్ కు ముందు తాను ఫుడ్ పాయిజనింగ్ కు గురైనట్లు కార్ల్‌సన్ చెప్పాడు.
తొలి గేమ్ లో తెల్ల పావులతో ఆడిన అతడు.. 30 ఎత్తుల తర్వాత ప్రజ్ఞానందతో డ్రాకు అంగీకరించాడు. ఇక రెండో గేమ్ కూడా ఇద్దరూ దూకుడుగా ఆడారు. ఈ గేమ్ లోనూ ఫలితం తేలలేదు. దీంతో విజేతను తేల్చడానికి టైబ్రేకర్ అనివార్యమైంది. ఈ టైబ్రేకర్ ర్యాపిడ్ ఫార్మాట్లో జరుగుతుంది. ఒక్కో ప్లేయర్ కు 25 నిమిషాల టైమ్ కంట్రోల్ ఉంటుంది.
ఒక్కో ఎత్తుకు 10 సెకన్ల పెంపును అందుకుంటారు. ఒకవేళ ఇందులోనూ విజేత తేలకపోతే బ్లిట్జ్ గేమ్ ద్వారా విజేతను తేలుస్తారు. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ 3 అయిన ఫాబియానో కారువానాకు షాకిచ్చిన ప్రజ్ఞానంద.. చెస్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేశాడు. ప్రస్తుతం అతడు 2707 ఫిడే రేటింగ్ తో 29వ ర్యాంకులో ఉన్నాడు.
టైబ్రేకర్ ఎక్కడ చూడాలి?
గురువారం (ఆగస్ట్ 24) ప్రజ్ఞానంద, కార్ల్‌సన్ మధ్య టై బ్రేకర్ జరగనుంది. ఈ గేమ్ లైవ్ స్ట్రీమింగ్ ఫిడే (FIDE) యూట్యూబ్ ఛానెల్ తోపాటు చెస్‌బేస్ ఇండియా యూట్యూబ్ ఛానెల్లోనూ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ఈ గేమ్ లైవ్ స్ట్రీమింగ్ ను భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటల నుంచి చూడొచ్చు.
టాపిక్