French Open 2022| చరిత్ర సృష్టించిన రూడ్.. సెమీస్ చేరిన తొలి నార్వే ఆటగాడిగా ఘనత
02 June 2022, 9:20 IST
- ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్‌లో తొలిసారి ఓ నార్వే క్రీడాకారుడు అడుగుపెట్టాడు. క్వార్టర్స్‌లో క్యాస్పెర్ రూడ్.. డ్యానిష్ ఆటగాడు రూనేపై నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి నార్వేయన్‌గా రికార్డు సృష్టించాడు.
క్యాస్పెర్ రూడ్
ఫ్రెంచ్ ఓపెన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే మట్టి కోర్టు రారాజు రఫెల్ నాదల్ సెమీస్‌కు చేరుకోగా.. తాజాగా నార్వేకు చెందిన ఎనిమిదో సీడ్ క్యాస్పెర్ రూడ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టాడు. గురువారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌లో డ్యానిష్ ప్లేయర్ హోల్గర్ రూనేపై విజయం సాధించాడు. దీంతో ఏ గ్రాండ్‌స్లామ్‌లోనైనా నాలుగు దశల స్థాయిని దాటిని తొలి నార్వే ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లోనే కాదు గ్రాండ్‌స్లామ్‌లో ఈ ఘనత సాధించిన మొదటి నార్వే టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
క్వార్టర్స్‌లో రూనేపై రూడ్.. 6-1, 4-6, 7(7)-6, 6-3 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్‌లో సులభంగా విజయం సాధించిన క్యాస్పెర్ రూడ్.. తర్వాతి సెట్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. మూడో సెట్‌లో ఇద్దరి మధ్య హోరా హోరీ పోరు జరిగింది. అయితే చివరకు ఆ సెట్‌ను నార్వే ప్లేయరే సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక నాలుగో సెట్‌లో 6-3 తేడాతో విజయం సాధించింది.
ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన నార్వే ప్లేయర్.. 5-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం ఒక్క పాయింట్ మాత్రమే ప్రత్యర్థికి ఇచ్చి 34 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. గతేడాది ఫైనలిస్ట్ సిట్సిపాస్‌పై ఓడిన రూనే అనవసర తప్పిదాలు చేస్తూనే ఉన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రూడ్.. "నేను అద్భుతంగా మ్యాచ్ ప్రారంభించాను, ఇప్పటికే అతడితో నేను మూడు సార్లు ఆడాను. నాలుగో మ్యాచ్ అతడు ఎలా ఆడతాడో నాకు అవగాహన ఉంది." అని అన్నాడు.
రూడ్ సెమీస్ పోరులో క్రోయోషియాకు చెందిన మారిన్ సిలిక్‌తో తలపడనున్నాడు. ప్రస్తుతం రెండు సెమీస్ మ్యాచ్‌లకు నలుగురు ఆటగాళ్లు అర్హత సాధించారు. ఇంకో సెమీస్‌లో రఫెల్ నాదల్, జర్మన్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ తలపడనున్నారు.
టాపిక్