తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wimbledon 2023: అల్కరాజ్‍దే వింబుల్డన్ టైటిల్.. ఉత్కంఠ పోరులో జొకోవిచ్‍పై గెలుపు

Wimbledon 2023: అల్కరాజ్‍దే వింబుల్డన్ టైటిల్.. ఉత్కంఠ పోరులో జొకోవిచ్‍పై గెలుపు

16 July 2023, 23:53 IST

google News
    • Wimbledon 2023 - Carlos Alcaraz: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‍ను స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్‍లో దిగ్గజ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్‍ను ఓడించి ఈ ఏడాది వింబుల్డన్ విజేతగా నిలిచాడు. 
కార్లోస్ అల్కరాజ్
కార్లోస్ అల్కరాజ్ (REUTERS)

కార్లోస్ అల్కరాజ్

Wimbledon 2023 - Carlos Alcaraz: వింబుల్డన్ గ్రాండ్‍స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్ అత్యంత ఉత్కంఠభరితంగా జరిగింది. నాలుగున్నర గంటలకు పైగా ఐదు సెట్ల పాటు జరిగిన పోరులో చివరికి సంచలనమే నమోదైంది. ఫైనల్‍లో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్‍పై స్పెయిన్ యువ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ విజయం సాధించి, టైటిల్ కైవసం చేసుకున్నాడు. అల్కరాజ్‍కు ఇది రెండో గ్రాండ్‍స్లామ్ టైటిల్ కాగా.. తొలి వింబుల్డన్ ట్రోఫీ. లండన్‍లోని సెంటర్ కోర్ట్‌ వేదికగా నేడు జరిగిన వింబుల్డన్ 2023 పురుషుల సింగిల్స్ ఫైనల్‍లో అల్కరాజ్ 1-6, 7-6(8-6), 6-1, 3-6, 6-4 తేడాతో నొవాక్ జొకోవిచ్‍ను ఓడించాడు. 23 గ్రాండ్‍స్లామ్ టైటిళ్ల విజేత అయిన జొకోవిచ్‍కు 20 ఏళ్ల అల్కరాజ్ షాకిచ్చాడు. వింబుల్డన్ టైటిల్ గెలిచిన అల్కరాజ్‍కు 2.5 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.25కోట్లు) ప్రైజ్‍మనీ దక్కింది. వివరాలివే..

ఈ ఫైనల్ మ్యాచ్ తొలి సెట్‍లో ప్రస్తుత ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్‍పై నొవాక్ జొకోవిచ్‍ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఫోర్ హ్యాండ్ షాట్లతో అదరగొట్టాడు. వరుసగా గేమ్‍‍లు గెలుస్తూ ఓ దశలో ఏకంగా ఫస్ట్ సెట్‍లో 5-0కు చేరాడు. అల్కరాజ్ ఓ గేమ్ గెలిచినా.. వెంటనే జొకో అదరగొట్టాడు. 6-1తో తొలి సెట్ కైవసం చేసుకున్నాడు నొవాక్.

రెండో సెట్‍లో జొకోవిచ్, అల్కరాజ్ హోరాహోరీగా పోరాడారు. దీంతో ఏకంగా సెట్ 6-6తో టై అయింది. దీనివల్ల టై బ్రేకర్ తప్పనిసరి అయింది. టై బ్రేకర్‌లోనూ ఇద్దరూ నువ్వానేనా అన్నట్టుగా పోరాడారు. చివరికి 8-6తో టై బ్రేకర్‌లో ఆధిపత్యం చెలాయించాడు అల్కరాజ్. 7-6 (8-6)తో సెట్ కైవసం చేసుకున్నాడు.

మూడో సెట్‍లో అల్కరాజ్ అనూహ్యంగా విజృంభించాడు. జొకోవిచ్‍కు చెమటలు పట్టించాడు. ప్రత్యర్థి నొవాక్ సర్వీస్‍ను బ్రేక్ చేసుకుంటూ మూడో సెట్‍ను 6-1తో అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. నాలుగో సెట్‍లో జొకోవిచ్ పుంజుకున్నాడు. 6-3తో సెట్ దక్కించుకున్నాడు. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో సెట్‍కు చేరింది.

ఐదో సెట్‍లో స్పెయిన్ సంచలం కార్లోస్ అల్కరాజ్ విజృంభించాడు. జొకోవిచ్‍పై ఆధిపత్యం చూపాడు. ఓ దశలో 3-1కు దూసుకెళ్లాడు. అయితే, ఆ తర్వాత జొకోవిచ్ సైతం పుంజుకున్నాడు. దీంతో సెట్ 4-3కు చేరింది. ఆ తర్వాత జోరు కొనసాగించిన అల్కరాజ్.. ఐదో సెట్‍ను 6-4తో కైవసం చేసుకొని మ్యాచ్ గెలిచాడు. సంబరాలు చేసుకున్నాడు. తొలిసారి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.

తదుపరి వ్యాసం