MS Dhoni Birthday: వింబుల్డన్ మ్యాచ్ చూస్తున్న బర్త్‌డే బాయ్ ధోనీ.. ఫొటో వైరల్
07 July 2022, 10:01 IST
- MS Dhoni Birthday: టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడైన మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ గురువారం (జులై 7) తన 41వ బర్త్‌డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
వింబుల్డన్ మ్యాచ్ చూస్తున్న ఎమ్మెస్ ధోనీ
లండన్: నిండు చందురుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు.. నేను ఒక్కడిని ఒకవైపు.. లోకం ఒకవైపు.. ఇదీ మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ స్టైల్. తన చుట్టూ ఏం జరుగుతున్న పెద్దగా పట్టించుకోడు. మిన్ను విరిగి మీద పడినా చలించని తత్వం. తన పనేదో తాను పక్కాగా చేసుకుంటూ వెళ్తాడు. గురువారం (జులై 7) తన 41వ పుట్టిన రోజు సందర్భంగా కూడా ధోనీ ఇలాగే కనిపించాడు.
ఓవైపు ప్రపంచమంతా తనకు బర్త్‌డే విషెస్ చెబుతూ ఉంటే.. మరోవైపు ధోనీ మాత్రం ఇవేమీ పట్టనట్లు వింబుల్డన్ మ్యాచ్ చూస్తూ గడిపాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న అతడు బుధవారం రాత్రి సెంటర్ కోర్ట్‌లో జరిగిన రఫేల్ నడాల్ మ్యాచ్ చూశాడు. అతడు స్టాండ్స్‌లో ఉన్న ఫొటోను వింబుల్డన్ తన ట్విటర్‌లో షేర్ చేయడం విశేషం. ఈ ఫొటో వైరల్‌గా మారింది.
అటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇదే ఫొటోను తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. గ్రే బ్లేజర్, బ్లాక్ షేడ్స్‌లో ధోనీ చాలా కూల్‌గా కనిపించాడు. 40 ఏళ్లు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా ఉన్న ఎమ్మెస్‌డీ.. ప్రస్తుతం కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. వచ్చే సీజన్‌లోనూ తాను ఆడనున్నట్లు ఇప్పటికే అతడు స్పష్టం చేశాడు.
క్రికెట్ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలు (టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు ఉన్న ధోనీ.. ఇటు ఐపీఎల్‌లోనూ చెన్నై సారథిగా నాలుగుసార్లు ట్రోఫీ అందుకున్నాడు. ఇక ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలోనే ఇండియన్ టీమ్ ఇటు టెస్టుల్లో, అటు వన్డేల్లో టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లింది. ధోనీ కెప్టెన్సీలో ఇండియా 72 టెస్టుల్లో 41, 200 వన్డేల్లో 110, 60 టీ20ల్లో 27 మ్యాచ్‌లు గెలిచింది.
2004 నుంచి 2019 వరకూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కొనసాగిన ధోనీ మొత్తంగా 17226 రన్స్ చేశాడు. 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఓడిన తర్వాత మళ్లీ అతడు టీమిండియా జెర్సీలో కనిపించలేదు. ఆ మరుసటి ఏడాది ఆగస్ట్ 15న ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు.