తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma: రోహిత్‌ శర్మ తీరుపై బీసీసీఐ సీరియస్‌.. ప్లేయర్స్‌కు గట్టి వార్నింగ్‌!

Rohit Sharma: రోహిత్‌ శర్మ తీరుపై బీసీసీఐ సీరియస్‌.. ప్లేయర్స్‌కు గట్టి వార్నింగ్‌!

Hari Prasad S HT Telugu

27 June 2022, 21:59 IST

google News
    • టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై బీసీసీఐ చాలా సీరియస్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అతని తీరుతో విసిగిపోయిన బీసీసీఐ.. ఇప్పుడు మిగతా ప్లేయర్స్‌కు కూడా వార్నింగ్‌ ఇచ్చింది.
లండన్ లో షాపింగ్ చేస్తూ అభిమానితో ఫొటో దిగిన రోహిత్ శర్మ
లండన్ లో షాపింగ్ చేస్తూ అభిమానితో ఫొటో దిగిన రోహిత్ శర్మ (Twitter)

లండన్ లో షాపింగ్ చేస్తూ అభిమానితో ఫొటో దిగిన రోహిత్ శర్మ

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో కీలకమైన ఐదో టెస్ట్‌కు ముందు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొవిడ్‌ బారిన పడటం ఆందోళనకు గురి చేస్తోంది. టీమ్‌లో ఓపెనర్‌ కూడా అయిన అతని స్థానాన్ని అవసరమైతే భర్తీ చేయడం కోసం హుటాహుటిన మయాంక్‌ అగర్వాల్‌ను పంపించాల్సి వచ్చింది. అయితే కొవిడ్‌ తగ్గుముఖం పట్టకపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

మిగతా ప్లేయర్స్‌ అందరినీ కూడా కచ్చితంగా హోటల్‌ గదులకే పరిమితం కావాలని హెచ్చరించింది. కరోనా సోకిన రోహిత్‌ శర్మ ఇప్పుడు ఆ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడతాడా లేదా అన్నది సందేహంగా మారింది. ప్రస్తుతం అతడు క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌లో బయో బబుల్‌ రూల్స్‌ లేకపోవడంతో లండన్‌లో ల్యాండైన తర్వాత ఇండియన్ ప్లేయర్స్‌ స్వేచ్ఛగా రోడ్లపై తిరిగారు.

రోహిత్‌కు కరోనా సోకిందని తెలిసిన తర్వాత కూడా విరాట్‌ కోహ్లి లెస్టర్‌ రోడ్లపై తిరుగుతూ కనిపించాడు. దీనిపై బోర్డు సీరియస్‌ అయినట్లు బీసీసీఐ వర్గాలు ఏఎన్‌ఐకి వెల్లడించాయి. "ఎప్పుడూ బయట తిరిగే కొందరు ప్లేయర్స్‌ను బోర్డు తీవ్రంగా మందలించింది. కొందరు ప్లేయర్స్‌ పబ్లిక్‌లోకి వెళ్లి వాళ్లతో ఫొటోలు కూడా దిగారు. ఇది ప్రమాదకరం. జాగ్రత్తగా ఉండాలని చెప్పినా.. వాళ్లు తిరుగుతూనే ఉన్నారు. అందుకే వాళ్లకు మరోసారి ఇదే విషయం చెప్పాం" అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు.

లండన్‌లో దిగిన రోజే విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు షాపింగ్‌ చేసిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. వాళ్లు ఫ్యాన్స్‌తోనే ఫొటోలు దిగారు. అటు వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ కూడా ఈ మధ్య అభిమానులతో ఫొటో దిగుతూ కనిపించాడు. గతేడాది కరోనా కారణంగా రద్దయిన ఐదో టెస్ట్‌ జులై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరగనున్న విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం