India vs South Africa: దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన ఫిక్స్.. మ్యాచ్‍ల తేదీలు ఇవే..
14 July 2023, 21:48 IST
- India vs South Africa: దక్షిణాఫ్రికాలో టీమిండియా టూర్ పూర్తి షెడ్యూల్‍ను బీసీసీఐ నేడు ప్రకటించింది. తేదీలు, వేదికలను ఖరారు చేసింది.
India vs South Africa: దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన ఫిక్స్.. మ్యాచ్‍ల తేదీలు ఇవే (Photos: AP)
India vs South Africa: దక్షిణాఫ్రికాలో టీమిండియా టూర్ ఫిక్స్ అయింది. ఈ పర్యటన షెడ్యూల్‍ను బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నేడు (జూలై 14) ఖరారు చేసింది. డిసెంబర్ 2023 - జనవరి 2024 మధ్య భాతర జట్టు.. దక్షిణాఫ్రికా టూర్‌కు వెళుతుందని గతంలోనే ప్లాన్ వెల్లడించిన బీసీసీఐ.. నేడు తేదీలతో కూడిన పూర్తి షెడ్యూల్‍ను ప్రకటించింది. ఈ పర్యటనలో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. వివరాలివే..
టీ20 సిరీస్ ఇలా..
ఈ ఏడాది డిసెంబర్ 10వ తేదీన భారత జట్టు.. దక్షిణాఫికా పర్యటన మొదలవుతుంది. దర్బన్ వేదికగా డిసెంబర్ 10న టీమిండియా, సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరుగుతుంది. అనంతరం డిసెంబర్ 12న క్యూబెర్హాలో రెండో టీ20 పోటీ ఉండనుంది. డిసెంబర్ 14న జొహన్నెస్‍బర్గ్ వేదికగా మూడో టీ20 జరుగుతుంది.
వన్డే సిరీస్ తేదీలు
టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‍లో భాగంగా తొలి మ్యాచ్ డిసెంబర్ 17న జొహన్నెస్‍బర్గ్‌లో జరగనుంది. అనంతరం డిసెంబర్ 19న క్యూబెర్హా రెండో వన్డేకు ఆతిథ్యమివ్వనుంది. డిసెంబర్ 21న పార్ల్ వేదికగా జరిగే మూడో మ్యాచ్‍తో వన్డే సిరీస్ ముగియనుంది.
రెండు టెస్టులు
ఇక, భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్ కూడా జరగనుంది. ఈ ఏడాది డిసెంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరుగుతుంది. 2024 జనవరి 3 నుంచి జనవరి 7వ తేదీ మధ్య కేప్‍టౌన్‍లో రెండో టెస్టు జరగనుంది.
మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్ 10వ తేదీ నుంచి 2024 జనవరి 7వ తేదీ వరకు టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటన సాగనుంది.
ప్రస్తుతం టీమిండియా.. వెస్టిండీస్ పర్యనటలో ఉంది. ప్రస్తుతం తొలి టెస్టు జరుగుతోంది. ఆగస్టు 13 వరకు ఈ పర్యటన ఉండనుంది. అనంతరం ఐర్లాండ్ టూర్‌కు టీ20 సిరీస్ ఆడేందుకు వెళ్లనుంది భారత జట్టు. అనంతరం ఆసియా కప్‍లో టీమిండియా తలపడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ ప్రపంచకప్ తర్వాత దక్షిణాఫ్రికా టూర్‌కు టీమిండియా వెళ్లనుంది.