IND vs BAN 1st Odi: తొలి వన్డేలో టీమ్ ఇండియా ఓటమి - బంగ్లాను గెలిపించిన మెహదీ హసన్
04 December 2022, 19:28 IST
IND vs BAN 1st Odi: ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన బంగ్లాదేశ్ 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకున్నది.
బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్
IND vs BAN 1st Odi: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టింది టీమ్ ఇండియా. ఆదివారం హోరాహోరీగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఒక వికెట్ తేడాతో టీమ్ ఇండియా పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 186 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
కె.ఎల్ రాహుల్ 73 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ రాణించలేకపోవడంతో టీమ్ ఇండియా తక్కువ స్కోరుకు పరిమితమైంది. 187 పరుగుల టార్గెట్‌ను బంగ్లాదేశ్ 9 వికెట్లు నష్టపోయి ఛేధించింది. లక్ష్య ఛేధనలో బరిలో దిగిన బంగ్లాదేశ్‌కు తొలి బంతికే దీపక్ చాహర్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ షాంటోను ఔట్ చేశాడు. ఇనాముల్ హక్‌ను 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిరాజ్ ఔట్ చేయడంతో మ్యాచ్ రసవత్తరంగా మారేలా కనిపించింది.
కెప్టెన్ లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. షకీబ్ 29 రన్స్ చేసి ఔటయ్యాడు. లిటన్ దాస్ 41 రన్స్ చేశాడు. టార్గెట్ తక్కువగానే ఉండటంతో రహిమ్, మహ్మదుల్లా బంగ్లాదేశ్‌ను గెలిపించేలా కనిపించారు. కానీ టీమ్ ఇండియా బౌలర్లు సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ సేన్ విజృంభించడంతో బంగ్లా చకచకా వికెట్లు కోల్పోయింది.
ఏడు పరుగులకే ఐదు వికెట్లు నష్టపోయింది. ఓటమి దిశగా ప్రయాణిస్తున్న బంగ్లాదేశ్‌ను మెహదీ హసన్ 38 పరుగులు చేసి గెలిపించాడు. చివరి వికెట్‌కు మెహదీ హసన్, ముస్తాఫిజుర్ రహ్మన్ 51 పరుగులు జోడించారు. టీమ్ ఇండియా బౌలర్లలో సిరాజ్ మూడు, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ సేన్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.