Australian Open: 52 నిమిషాల్లోనే మ్యాచ్ ఫినిష్.. దుమ్మురేపిన డిఫెండింగ్ చాంపియన్
19 January 2024, 16:27 IST
- Australian Open 2024 - Aryna Sabalenka: ఆస్ట్రేలియన్ ఓపెన్‍లో డిఫెండింగ్ చాంపియన్ అరినా సబలెంక మరోసారి దుమ్మురేపారు. అలవోక విజయంతో ప్రీ-క్వార్టర్‌లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్‌లో నొవాక్ జొకోవిచ్, సిట్సిపాస్, సిన్నర్ అలవోకగా మూడో రౌండ్ గెలిచారు.
అరినా సబలెంక
Australian Open 2024 - Aryna Sabalenka: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 టెన్నిస్ గ్రాండ్‍స్లామ్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. నేడు (జనవరి 19) జరిగిన టోర్నీ మహిళల సింగిల్స్ మూడో రౌండ్‍లో డిఫెండింగ్ చాంపియన్, బెలారస్ స్టార్ అరినా సబలెంక సూపర్ విక్టరీ సాధించారు. మూడో రౌండ్‍లో రెండో సీడ్ సబలెంక 6-0, 6-0 వరుస సెట్లలో ఒక్క రౌండ్ కూడా కోల్పోకుండా ఉక్రెయిన్ ప్లేయర్ లేసియా సురెంకోపై పూర్తి ఆధిపత్యంతో గెలిచారు. దీంతో ప్రీ-క్వార్టర్స్ (నాలుగో రౌండ్)లో అరినా సబలెంక అడుగుపెట్టారు.
52 నిమిషాల్లోనే..
ఈ మ్యాచ్‍లో లెసియా సురేంకోపై అరినా సబలెంక 52 నిమిషాల్లోనే విజయం సాధించారు. ఏ దశలోనూ సురేంకోకు అవకాశం ఇవ్వలేదు. ప్రత్యర్థి సర్వీస్‍ను సబలెంక ఆరుసార్లు బ్రేక్ చేశారు. ఈ మ్యాచ్‍లో ఒక్క ఏస్ కూడా నమోదు కాకపోవడం మరో స్పెషాలిటీగా ఉంది. కాగా, లెసియా ఏకంగా ఆరు డబుల్ ఫాల్ట్ చేశారు. ఆఖరి వరకు అదే ఆధిపత్యాన్ని చూపిన అరినా సబలెంక గెలిచి.. ప్రీ-క్వార్టర్స్ పోరుకు చేరారు. ప్రీ-క్టార్టర్లో అమంద అనిసిమోవాతో సబలెంక తలపడనున్నారు.
మహిళల సింగిల్స్ మూడో రౌండ్‍లో అమెరికా యంగ్ సెన్సేషన్ కోకో గాఫ్ 6-0, 6-2 తేడాతో అలింసియా పార్క్స్ పై గెలిచింది. ఈ మ్యాచ్ గంటా 1 నిమిషం పాటు సాగింది. ప్రత్యర్థి సర్వీస్‍ను 5సార్లు బ్రేక్ చేశారు నాలుగో సీడ్ గాఫ్. ఫుల్ జోష్‍తో ప్రీ-క్వార్టర్‌లో అడుగుపెట్టారు.
సిట్సిపాస్, సిన్నెర్ గెలుపు
పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‍లో ఏడో సీడ్ స్టెఫినోస్ సిట్సిపాస్ 6-3, 6-0, 6-4 తేడాతో లుకా వాన్ అస్చేపై గెలిచాడు. వరుస గెట్లలో సిట్సిపాస్ విజయం సాధించాడు. 12 ఏస్‍లతో దుమ్మరేపాడు. తన మార్క్ బ్యాక్ హ్యాండ్ పవర్ ఫుల్ షాట్లతో అదరగొట్టాడు. మరో మ్యాచ్‍లో ఇటలీ స్టార్ ప్లేయర్ నాలుగో సీడ్ జానిక్ సిన్నెర్ 6-0, 6-1, 6-3 తేడాతో సెబాస్టియన్ బాయెజ్‍పై గెలిచి ప్రీ-క్వార్టర్స్ చేరాడు.
జకోవిచ్ కూడా వరుస సెట్లలో..
ప్రపంచ నంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ కూడా పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‍లో వరుస సెట్లలో విజయం సాధించాడు. డిఫెండింగ్ చాంపియన్ జోకో ఈ మ్యాచ్‍లో 6-3, 6-3, 7-6 (7/2) తేడాతో అర్జెంటీనా అన్‍సీడెడ్ ప్లేయర్ థామస్ మార్టిన్ ఎట్రెవెర్రిపై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లను సునాయసంగానే చేజిక్కించుకున్న జోకో.. మూడో సెట్‍లో మాత్రం చెమటోడ్చాడు. టై బ్రేకర్ వరకు వెళ్లగా.. మొత్తంగా సెట్‍ను నొవాక్ దక్కించుకున్నారు. ప్రీ-క్వార్టర్స్‌కు జోకోవిచ్ చేరాడు.
తొలి సెట్‍లో జోకోవిచ్ 5-2తో దూసుకెళ్లిన సమయంలో మార్టిన్ ప్రతిఘటించాడు. ఓ తర్వాత గేమ్ నిలబెట్టుకున్నాడు. అయితే, తర్వాతి గేమ్‍లో దూకుడు చూపిన జొకో ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా కైవసం చేసుకున్నాడు. 6-3తో తొలి సెట్ కైవసం చేసుకున్నాడు. ఇక రెండో సెట్‍లోనూ తుది వరకు ఆధిపత్యం చూపాడు. మూడో సెట్ హోరాహోరీగా సాగింది. జొకోకు మార్టిన్ గట్టి పోటీ ఇచ్చాడు. దీంతో ఓ దశలో 3-3కు సెట్ చేరింది. ఆ తర్వాత ఇద్దరూ ఒక్కో గేమ్ గెలుస్తూ రావటంతో 6-6కు వచ్చి టై బ్రేకర్ అనివార్యం అయింది. టై బ్రేకర్‌లో జోకోవిచ్ దూకుడు చూపించాడు. 7-2తో టై బ్రేకర్‌ను సునాయసంగా దక్కించుకున్నాడు.