IndiaW vs AustraliaW 4th T20I: ఆస్ట్రేలియాపై భారత అమ్మాయిల ఓటమి.. సిరీస్ చేజేతుల సమర్పణం
17 December 2022, 22:26 IST
- IndiaW vs AustraliaW 4th T20I: ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన నాలుగో టీ20 భారత అమ్మాయిలు 7 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. ఫలితంగా సిరీస్ ఆసీస్ 3-1 తేడాతో మరో మ్యాచ్ మిగిలుండగానే గెలిచింది.
భారత్ పై ఆస్ట్రేలియా విజయం
IndiaW vs AustraliaW 4th T20I: ఆస్ట్రేలియా మహిళల జట్టు.. భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం జరిగిన నాలుగో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ 3-1 తేడాతో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు ముందుకు 1-2 తేడాతో వెనుకంజలో ఉన్న భారత అమ్మాయిలు.. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఫలితంగా సిరీస్ ఆసీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కంగారూ జట్టు నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని చేధనలో విఫలమైన భారత్ 181 పరుగులకే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లు ఆష్లే గార్డనర్, అలానా కింగ్ చెరో రెండు వికెట్లతో భారత బ్యాటర్లకు కళ్లెం వేశారు.
189 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభమేమి దక్కలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే స్టార్ బ్యాటర్ స్మతీ మంధానా(16) ఆష్లే చేతిలో ఔటైంది. అనంతరం కాసేపటికే షెఫాలీ వర్మ(20) కూడా డార్సీ బ్రౌన్ చేతిలో ఔటై పెవిలియన్ చేరింది. ఆ తదుపరి ఓవర్‌లోనే అలానా కింగ్ రోడ్రిగ్స్(8)ను వెనక్కి పంపింది. ఈ విధంగా 49 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి భారత్.. పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(46), దైవిక వైద్య(32) భారత శిభిరంలో ఆశలు చిగురింపజేశారు.
వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కంగారూ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని జట్టును విజయం దిశగా నడిపించారు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు వేగాన్ని పెంచారు. అయితే ఈ సమయంలోనే అలానా కింగ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. హర్మన్ ప్రీత్ కౌర్‌ను ఔట్ చేసి భారత విజయావకాశాలపై నీళ్లు చల్లింది. కెప్టెన్ ఔట్ కావడంతో భారత్ ఆత్మ రక్షణ ధోరణిలో పడింది. రన్‌రేట్ క్రమేణా తగ్గడంతో మ్యాచ్ చివరకు ఉత్కంఠగా మారింది.
హర్మన్ ప్రీత్ కౌర్ ఔటైన కాసేపటికే దైవికా వైద్య కూడా పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఆసీస్ వైపు మొగ్గింది. 18వ ఓవర్ వేసిన గార్డనర్.. ఆ ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి దైవిక వైద్య లాంటి కీలక వికెట్ తీసింది. ఫలితం రెండు ఓవర్లలో 38 పరుగులుగా మారింది. 19వ ఓవర్లో రిచా ఘోష్(40) రెండు సిక్సర్లతో విరుచుకపడి ఆ ఓవర్లో 18 పరుగులు పిండుకుంది. ఇంక ఆఖరు ఓవర్‌లో భారత గెలుపునకు 20 పరుగులు అవసరం కాగా.. పొదుపుంగా బౌలింగ్చేసిన షూట్ కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో భారత మహిళల జట్టు 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టులో పెర్రీ(72) అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకోగా.. గార్డనర్(42) మెరుపులు మెరిపించింది. చివర్లో గ్రేస్ హ్యారీస్(27) కూడా వేగంగా ఆడి ఆస్ట్రేలియాకు భారీ స్కోరును అందించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా.. రాధా యాదవ్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకుంది.