Pat Cummins to Skip IPL 2023: వచ్చే ఐపీఎల్‌కు ఆసీస్ స్టార్ దూరం.. కారణం అదేనా?
15 November 2022, 13:58 IST
- Pat Cummins to Skip IPL 2023: ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. ఐపీఎల్ 2023కి దూరం కానున్నాడు. వరుస అంతర్జాతీయ షెడ్యూల్ ఉన్న కారమంగా యాషెస్, వన్డే వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకుని వచ్చే ఐపీఎల్ ఆడలేనని ట్విటర్ వేదికగా తెలియజేశాడు.
ప్యాట్ కమిన్స్
Pat Cummins to Skip IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగులో ఆడేందుకు మన ఆటగాళ్లే కాకుండా ఇతర దేశాలకు చెందిన ప్లేయర్లు కూడా ఎంతో ఉత్సుకతను చూపిస్తారు. ఐపీఎల్‌లో సత్తాచాటితే డబ్బుకు డబ్బుతో పాటు ఎంతో గర్వంగా ఫీలవుతుంటారు. అందుకే వేలంలో ఓవర్సీస్ ప్లేయర్ల నుంచి కూడా పోటీ ఎక్కువగా ఉంటుంది. స్టార్ ఆటగాళ్లు సైతం ఐపీఎల్‌లో ఆడేందుకు ఎంతో ఆత్రుతగా ఉంటారు. అలాంటిది ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మాత్రం వచ్చే ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి చూపించట్లేదు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో కాదు.. ఆసీస్ వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్. తాను ఐపీఎల్ 2023 సీజన్‌కు దూరం కానున్నానని అతడు ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్వీటర్ వేదికగా తెలియజేశాడు.
"వచ్చే ఏడాది ఐపీఎల్‌కు దూరమవ్వాలని నేను చాలా కష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నాను. రాబోయే 12 నెలలు పాటు అంతర్జాతీయ టెస్టులు, వన్డేలతో షెడ్యూల్ నిండిపోయింది. కాబట్టి యాషెస్ సిరీస్, ప్రపంచకప్‌నకు ముందు కొంత విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను." అని ప్యాట్ కమిన్స్ తన ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
ఐపీఎల్‌లో గత మూడేళ్లుగా కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కమిన్స్.. తన నిర్ణయం గురించి జట్టుకు కూడా తెలియజేశాడు. తన పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్‌కు మరో ట్వీట్ రూపంలో ధన్యవాదాలు తెలిపాడు. ఆటగాళ్లు, సిబ్బంది కూడిన జట్టు ఎంతో అద్భుతమైందని, నేను వీలైనంత త్వరగా మళ్లీ కలుసుకోగలనని ఆశీస్తున్నట్లు ప్రకటించాడు.
2014లో తొలిసారిగా కమిన్స్ కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014, 2015 రెండు సీజన్లు కలిపి కూడా కేవలం నాలుగు మ్యాచ్‌లే ఆడాడు. అనంతరం 2017లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. అక్కడ నుంచి మళ్లీ కేకేఆర్ గూటికి చేరాడు. గతేడాది ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ కేవలం 14 బంతుల్లోనే అర్ధశతకం సాధించి వేగంగా ఈ ఘనత సాధించిన కేఎల్ రాహుల్‌ను సమం చేశాడు.
ఇటీవల కమిన్స్ టీ20 ప్రపంచకప్‌లోనూ ఆసీస్ తరఫున ఆడాడు. అయితే ఆస్ట్రేలియా సెమీస్‌కు కూడా చేరకుండానే నిరాశ పరిచింది.
టాపిక్