తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final: రెండో రోజు రాణించిన భారత పేసర్లు: ఆసీస్ ఆలౌట్: స్మిత్ శతకం

WTC Final: రెండో రోజు రాణించిన భారత పేసర్లు: ఆసీస్ ఆలౌట్: స్మిత్ శతకం

08 June 2023, 19:31 IST

google News
    • WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‍లో రెండో రోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
WTC Final: రెండో రోజు రాణించిన భారత పేసర్లు: ఆసీస్ ఆలౌట్
WTC Final: రెండో రోజు రాణించిన భారత పేసర్లు: ఆసీస్ ఆలౌట్ (ICC Twitter)

WTC Final: రెండో రోజు రాణించిన భారత పేసర్లు: ఆసీస్ ఆలౌట్

WTC Final: ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మంచి స్కోరు సాధించింది. టీమిండియాకు సవాల్ విసిరింది. అయితే, రెండో రోజు రాణించిన భారత పేసర్లు.. ఆసీస్ మరీ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగారు. లండన్‍లోని ఓవల్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‍లో గురువారం రెండో రోజు 469 పరుగుల వద్ద ఆసీస్ ఆలౌటైంది. 3 వికెట్లకు 327 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద రెండో రోజును ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 142 పరుగులను జోడించుకుంది. ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (268 బంతుల్లో 121 పరుగులు, 19 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (174 బంతుల్లో 163 పరుగులు), అలెక్స్ క్యారీ (69 బంతుల్లో 48) అదరగొట్టారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌కు చెరో రెండు వికెట్లు, స్పిన్నర్ రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‍మన్ గిల్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించారు.

లంచ్‍కు ముందే నాలుగు వికెట్లు

146 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‍ను రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. అనంతరం కామెరాన్ గ్రీన్‍ (6)ను మహమ్మద్ షమీ పెవిలియన్‍కు పంపాడు. 95 పరుగుల స్కోరుతో బ్యాటింగ్ కంటిన్యూ చేసిన ఆసీస్ సీనియర్ స్టార్ స్టీవ్ స్మిత్‍ కాసేపు దూకుడు ప్రదర్శించాడు. అయితే, కాసేపటికే స్మిత్‍ను శార్దూల్ ఠాకూర్ బౌల్డ్ చేశాడు. అద్భుతమైన ‘త్రో’తో సబ్‍స్టిట్యూట్ ఫీల్డర్ అక్షర్ పటేల్.. మిచెల్ స్టార్క్‌(5)ను ఔట్ చేశాడు. దీంతో ఫస్ట్ సెషన్‍లో నాలుగు వికెట్లను కోల్పోయిన ఆసీస్ లంచ్ విరామ సమయానికి 7 వికెట్లకు 422 పరుగులు చేసింది.

అనంతరం క్యారీకి ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (9) కాసేపు తోడుగా నిలిచాడు. అలెక్స్ క్యారీని ఔట్ చేసి ఈ జోడీని భారత స్పిన్నర్ జడేజా విడదీశాడు. ఆ తర్వాత నాథన్ లియాన్ (9)ను సిరాజ్, కమిన్స్‌ను సిరాజ్ ఔట్ చేశారు. మొత్తంగా 469 పరుగులకు ఆస్ట్రేలియా రెండో సెషన్‍లో ఆలౌటైంది.

తొలి రోజంతా శ్రమించి మూడు వికెట్లు తీసిన భారత బౌలర్లు.. రెండో రోజు 36 ఓవర్లలోనే మిగిలిన ఏడు వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా కాస్త అడ్డుకున్నారు.

తదుపరి వ్యాసం