Asian Games 2023: క్రికెట్ స్టేడియాలు ఇలా కూడా ఉంటాయా.. చైనా తీరుపై ఫ్యాన్స్ షాక్
19 September 2023, 14:56 IST
- Asian Games 2023: క్రికెట్ స్టేడియాలు ఇలా కూడా ఉంటాయా అంటూ చైనా తీరుపై ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నాయి. ఆసియా గేమ్స్ 2023 కోసం ఆ దేశం క్రికెట్ కోసం కేటాయించిన స్టేడియాల షేప్ పూర్తి భిన్నంగా ఉంది.
చైనాలోని ఆసియా గేమ్స్ లో భాగంగా క్రికెట్ కోసం ఉపయోగించనున్న స్టేడియం
Asian Games 2023: పైన ఫొటోలో ఉన్న క్రికెట్ స్టేడియం చూశారు కదా. ఇది చైనాలో ఏషియన్ గేమ్స్ 2023లో క్రికెట్ కోసం ఉపయోగించే స్టేడియం. సాధారణంగా ఇన్నాళ్లూ మనం క్రికెట్ గ్రౌండ్ అంటే రౌండ్ గా లేదంటా అక్కడక్కడా కాస్త స్క్వేర్ షేప్ లో ఉండటం చూశాం. కానీ చైనాలోని ఈ స్టేడియం మాత్రం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
క్రికెట్ స్టేడియాలు ఇలా కూడా ఉంటాయా అంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈసారి ఏషియన్ గేమ్స్ చైనాలోని హాంగ్ఝౌలో జరుగుతున్నాయి. అక్కడ చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఈ స్టేడియం ఆకట్టుకునేలా ఉంది. దీని షేపు మాత్రం వింతగా ఉన్నా.. ఇక్కడి అత్యాధునిక సౌకర్యాలు మాత్రం ప్రేక్షకులకు ఓ కొత్త క్రికెట్ మ్యాచ్ అనుభవాన్ని అందించనున్నాయి.
12 వేల మంది చూడొచ్చు
హాంగ్ఝౌలోని ఈ క్రికెట్ స్టేడియంలో 12 వేల మంది కూర్చొని మ్యాచ్ చూడొచ్చు. దీని అద్భుతమైన డిజైన్, చుట్టూ పచ్చదనం, అత్యాధునిక సౌకర్యాలు ఫ్యాన్స్ ను ఆకర్షిస్తున్నాయి. పైగా బౌండరీలు కూడా దగ్గరగా ఉండటంతో ఆసియా గేమ్స్ లో భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. చైనాలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇదే కావడం విశేషం.
ఆసియాలోని క్రికెట్ జెయింట్స్ అన్నీ ఈ గేమ్స్ లో తలపడనున్నాయి. ఇండియా నుంచి వెళ్లే జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉండనున్నాడు. ఈ గేమ్స్ కోసం బీసీసీఐ ఓ యంగ్ టీమ్ ను పంపనుంది. ఐదేళ్ల తర్వాత ఏషియన్ గేమ్స్ లోకి క్రికెట్ తిరిగి వస్తుండటంతో ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2010 ఆసియా గేమ్స్ లో తొలిసారి క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది.
అయితే 2018లో జకార్తాలో జరిగిన గేమ్స్ నుంచి క్రికెట్ ను తొలగించారు. 2010, 2014లలో టీ20 ఫార్మాట్ లో క్రికెట్ గేమ్స్ నిర్వహించారు. చివరిసారి ఆసియా గేమ్స్ జరిగినప్పుడు ఇండియా జట్టును పంపలేదు. ఈసారి రుతురాజ్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ ను పంపిస్తోంది. ఈసారి ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావడమే తన లక్ష్యమని రుతురాజ్ అన్నాడు. గతంలో బంగ్లాదేశ్, శ్రీలంకలు గోల్డ్ మెడల్స్ గెలిచాయి. వుమెన్స్ కేటగిరీలో రెండుసార్లూ పాకిస్థాన్ ఖాతాలోకే మెడల్స్ వెళ్లాయి.