Asia Cup 2023: ఆసియా కప్ తేదీలు వచ్చేశాయి.. రెండు దేశాల్లో టోర్నీ.. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‍లు అక్కడే!
15 June 2023, 17:04 IST
- Asia Cup 2023: ఆసియా కప్ తేదీలను, వేదికలను ఏసీసీ ప్రకటించింది. ఆగస్టు 31వ తేదీ నుంచి ఈ టోర్నీ జరగనుంది.
Asia Cup 2023: ఆసియా కప్ తేదీలు వచ్చేశాయి.. రెండు దేశాల్లో టోర్నీ.. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‍లు అక్కడే! (Reuters)
Asia Cup 2023 Dates, Venues: ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీ నిర్వహణపై ఉత్కంఠ వీడింది. ఈ టోర్నీ తేదీలను, వేదికలను ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) నేడు ఖరారు చేసింది. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్ జరగనుంది. పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లో ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీ కోసం హైబ్రిడ్ మోడల్‍కే మొగ్గు చూపింది ఏసీసీ. ఆసియా కప్‍లో పాకిస్థాన్‍లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‍లు నిర్వహించనున్నట్టు ఏసీసీ పేర్కొంది.
ఆసియా కప్‍లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. రెండు గ్రూప్‍లుగా జట్లు ఉండనున్నాయి. ప్రతీ గ్రూప్‍లో మూడు టీమ్‍లు ఉంటాయి. లీగ్ దశ మ్యాచ్‍ల తర్వాత ప్రతీ గ్రూప్ పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు సూపర్ ఫోర్‌కు చేరుకుంటాయి. సూపర్ ఫోర్ నుంచి రెండు జట్లు ఫైనల్ చేరతాయి. టైటిల్ కోసం ఫైనల్‍లో రెండు టీమ్‍లు తలపడతాయి. మొత్తంగా ఈ ఆసియా కప్ టోర్నీలో 13 వన్డే మ్యాచ్‍లు జరగనున్నాయి. పూర్తి షెడ్యుల్‍ను ఏసీసీ త్వరలో ప్రకటించనుంది.
కాగా, ఆసియా కప్‍లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‍లు శ్రీలంక వేదికగా జరగనుండడం ఖరారైంది. పాక్‍కు టీమిండియాను పంపేందుకు బీసీసీఐ నిరాకరించటంతో ఆసియా కప్ టోర్నీని హైబ్రిడ్ మోడల్‍లో పాకిస్థాన్, శ్రీలంకలో నిర్వహించేందుకు ఏసీసీ నిర్ణయించింది. ఆసియా కప్‍లో అన్ని మ్యాచ్‍లను శ్రీలంకలోనే ఆడనుంది భారత జట్టు.
సాధారణంగా ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీకి పూర్తిగా పాకిస్థాన్ అతిథ్యం ఇవ్వాల్సింది. అయితే, పాకిస్థాన్‍కు భారత జట్టును పంపేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది. దీంతో పాకిస్థాన్, శ్రీలంకలో సంయుక్తంగా హైబ్రిడ్ మోడల్‍లో ఈ టోర్నీని నిర్వహించేందుకు ఏసీసీ నిర్ణయించింది. యూఏఈ ఆప్షన్‍ను కూడా పరిశీలించిన ఏసీసీ.. చివరికి శ్రీలంకను ఎంపిక చేసుకుంది.
కాగా, ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం పాక్ జట్టు భారత్‍కు రావాల్సి ఉంది. ఇప్పుడు ఆసియా కప్‍ను హైబ్రిడ్ మోడల్‍లో నిర్వహిస్తుండటంతో పాక్ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‍ను ఐసీసీ త్వరలో ప్రకటించనుంది.