Allan Border Slams Australia: ఆసీస్ బ్యాటర్లపై విరుచుకుపడిన అలెన్ బోర్డర్.. వ్యూహాన్ని మార్చుకోవాలని స్పష్టం
08 January 2024, 20:16 IST
- Allan Border Slams Australia: ఆస్ట్రేలియా బ్యాటర్లపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు అలెన్ బోర్డర్ ఓ రేంజ్‌లో విరుచుకపడ్డారు. స్పిన్ బౌలింగ్‌లో బ్యాటర్లు తమ విధానాన్ని మార్చుకోవాలని, వ్యూహాన్ని ముందుగానే అంచనా వేయాలని స్పష్టం చేశారు.
ఆసీస్‌పై అలెన్ బోర్డర్ విమర్శలు
Allan Border Slams Australia: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ముందంజ వేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రెండో టెస్టులో ఆరంభంలో అద్భుత ప్రదర్శన చేసిన ఆసీస్ ఆటగాళ్లు.. మూడో రోజు మాత్రం మ్యాచ్‌ను చేజేతులా సమర్పించుకున్నారు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో స్వీప్ షాట్లు ఆడుతూ వికెట్లు కోల్పోయారు. ఒక్క సెషన్‌లో 9 వికెట్లు పడితే.. అందులో ఐదు స్వీప్ షాట్లు ఆడి సమర్పించుకున్నారు. తాజాగా ఈ అంశంపై ఆసీస్ గ్రేట్ అలెన్ బోర్డర్ స్పందించారు. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని జట్టును దారుణంగా విమర్శించాడు. వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పుడు బయట ఏం జరుగుతుందో విడిచిపెట్టి వ్యూహాన్ని అంచనా వేయాలని హిత బోధ చేశారు.
"బయట ఏం జరుగుతుందో ఆస్ట్రేలియా జట్టు వదిలేయాలి. రేడియోలను ఆపేయాలి. రాబోయే రెండు రోజులు వార్తాపత్రికలు చదవడం మానేయాలి. బదులుగా నాణ్యమైన స్పిన్ బౌలింగ్‌లో ఎలా ఆడాలో చర్చించుకోవాలి. ఈ విషయంపై మాట్లాడుకోవాలి. ఓ పద్ధతిని కలిగి ఉండాలి. క్రాస్ బ్యాట్ సరైన విధానం కాదు. మీ ఇన్నింగ్స్ ఆరంభం అలా లేదు." అని అలెన్ బోర్డర్ వివరించారు.
ఇన్నింగ్స్ ఆరంభంలో ఉస్మాన్ ఖవాజా స్వప్ షాట్‌లతో గేమ్‌కు వైవిధ్యాన్ని జోడించాడని అలెన్ బోర్డర్ అన్నారు. పరిస్థితులు మారుతున్న కొద్ది వ్యూహాన్ని మార్చుకోవాలని అన్నారు.
"ఉస్మాన్ ఖవాజా రివర్స్ స్వీప్‌లను బాగా ఆడాడు. అయితే పిచ్ తక్కువగా ఉండటంతో షాట్‌లు ప్రమాదకరంగా మారాయి. కాబట్టి వారు తిరిగి అంచనా వేయాల్సి వచ్చింది. టెస్టుల్లో అలాంటి బ్యాటింగే చేయాలి. మొదటి 15-20 పరుగుల కోసం మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. పరిస్థితులకు అలవాటు పడినందున మీరు అకస్మాత్తుగా ఇన్నింగ్స్ వేగంగా మార్చవచ్చు." అని బోర్డర్
వివరించారు. ఆసీస్ బ్యాటర్ల విషయంలో తాను బాధ పడ్డానని, కానీ కఠినమైన పరిస్థితుల నుంచి నేర్చుకొని సరైన వ్యూహాన్ని అవలంభించాలని స్పష్టం చేశారు.
రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులతో మెరుగైన స్కోరు సాధించిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ను 262 పరుగులకు కట్టడి చేయడమే కాకుండా.. రెండో ఇన్నింగ్స్‌ను 61/1తో శుభారంభం చేసింది. మూడో రోజు భారత స్పిన్నర్లు తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడమే కాకుండా మ్యాచ్‌ను చేజిక్కించుకున్నారు. రవీంద్ర జడేజా 7 వికెట్లతో అదిరిపోయే ప్రదర్శన చేసి భారత్‌ను 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిపారు. మూడో టెస్టు అహ్మదబాద్ వేదికగా మార్చి 1 నుంచి మొదలు కానుంది.