Alex Carey on Ahmedabad Test: చివరి రోజు మాకు సవాలే: ఆస్ట్రేలియా వికెట్ కీపర్
12 March 2023, 22:10 IST
- Alex Carey on Ahmedabad Test: చివరి రోజు మాకు సవాలే అని అన్నాడు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీ. అహ్మదాబాద్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇండియా కీలకమైన 91 పరుగుల లీడ్ తీసుకోవడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.
చివరి రోజు ఆస్ట్రేలియాకు సవాలే అంటున్న అలెక్స్ కేరీ
Alex Carey on Ahmedabad Test: అహ్మదాబాద్ టెస్ట్ నాలుగో రోజు ముగిసే సమయానికి కాస్త ఇండియా వైపు మొగ్గింది. ఇప్పటికీ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నా.. ఒకవేళ గెలిచే అవకాశం ఉన్న టీమ్ ఏదైనా ఉందంటే అది ఇండియానే. నాలుగో రోజు కోహ్లి సెంచరీ, అక్షర్ హాఫ్ సెంచరీతో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 571 పరుగులు చేసి 91 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో నాలుగో రోజు ఆరు ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆ టీమ్ వికెట్ కోల్పోలేదు కానీ తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజా మోకాలికి గాయమైంది. దీంతో నైట్ వాచ్‌మన్ గా స్పిన్నర్ కునెమాన్ ను ఆస్ట్రేలియా పంపించింది. ఇలాంటి పరిస్థితుల్లో తమకు చివరి రోజు పెను సవాలే అని అన్నాడు ఆ టీమ్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ.
"కచ్చితంగా ఇది మాకు పెద్ద సవాలే. తొలి గంట కాస్త జాగ్రత్తగా ఆడతాం. ఆ తర్వాత ఏమవుతుందో చూడాలి. నిజానికి ఇండియా లీడ్ తగ్గించడంలో మేము విజయవంతమయ్యాం" అని కేరీ అన్నాడు. ఇక ఖవాజా గాయపడిన తర్వాత నైట్ వాచ్‌మన్ గా వచ్చిన కునెమాన్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన తీరునూ అతడు ప్రశంసించాడు.
"అతడు అద్భుతంగా ఆడాడు. బంతితో అతడు రాణించలేదు. కానీ అతని బ్యాటింగ్ చూసిన తర్వాత మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. ఇండియన్ స్పిన్నర్లతో కొత్త బంతి ఎదుర్కోవడం చాలా కష్టం. ఆ లెక్కన ట్రావిస్ హెడ్ తో కలిసి కునెమాన్ చాలా బాగా ఆడాడు. చివరి 20 నిమిషాల ఆట కావడంతో నైట్ వాచ్‌మన్ ను పంపించాలని నిర్ణయించాం" అని కేరీ చెప్పాడు.
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 పరుగులు చేసింది. ఇంకా 88 పరుగులు వెనుకబడే ఉంది. పిచ్ ఇప్పటికే బౌలర్లకు అంతగా అనుకూలించడం లేదు. ఇలాంటి పిచ్ పై చివరి రోజు ఇండియన్ బౌలర్లు ఏం చేస్తారో చూడాలి.